TDP-JANASENA: ఒకే వేదికపై చంద్రబాబు-పవన్‌

TDP-JANASENA: ఒకే వేదికపై చంద్రబాబు-పవన్‌
ఈనెల 28న భారీ బహిరంగ సభ.... కీలక నిర్ణయాలను ఉమ్మడిగా ప్రకటించనున్న చంద్రబాబు-పవన్‌

ఈ నెల 28న తాడేపల్లి గూడెంలో ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలుగుదేశం - జనసేన పార్టీలు నిర్ణయించాయి. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పంచుకోనున్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలను ఉమ్మడిగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బై బై వైసీపీ అనేది ప్రజలందరి నినాదం కావాలనే లక్ష్యంతో ఉమ్మడి కార్యాచరణపై తెలుగుదేశం- జనసేన సమన్వయ కమిటీలో చర్చించి పలు తీర్మానాలకు ఆమోదం తెలిపాయి. తెలుగుదేశం పార్టీని NDAలోకి ఆహ్వానించినందున... త్వరలోనే ఆ విషయంపై స్పష్టత వస్తుందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు.


సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం-జనసేన ప్రణాళిక రచిస్తున్నాయి. ఈ మేరకు ఈ నెల 28న తాడేపల్లి గూడెంలో.. ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ బహిరంగ సభలో చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో.. ఇరువురు నేతలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. విజయవాడలో తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ సభ్యులు సమావేశమై కీలక విషయాలపై సమాలోచనలు చేశారు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ హామీని ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే అంశంపై చర్చించారు. ఈ భేటీలో రెండు పార్టీల పొత్తును స్వాగతించిన తెలుగుదేశం,జనసేన కేడర్‌ను అభినందిస్తూ తీర్మానం చేశారు. మీడియాపై దాడులను తప్పుపడుతూ మరో తీర్మానం చేశారు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం-జనసేన మధ్య ఎలాంటి గ్యాప్‌ లేకుండా పనిచేస్తామని.. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగుదేశంని NDAలోకి ఆహ్వానించారని, త్వరలో స్పష్టత వస్తుందన్నారు. అందులో దాపరికం ఏం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.తెలుగుదేశం-జనసేన మధ్య వైసీపీ తగువులు పెట్టే ప్రయత్నం చేస్తోందని వాటిని ధీటుగా ఎదుర్కొంటామని తెలిపారు.


రెండు నెలల్లో వైసీపీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు విముక్తి లభిస్తుందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ధీమా వ్యక్తం చేశారు. బై బై వైసీపీ అనేది ప్రజా నినాదంగా మారాలని పిలుపునిచ్చారు. రైతులకు అందించే పెట్టుబడి సాయం కౌలు రైతులకు వర్తింప చేసే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించినట్టు నేతలు తెలిపారు. ఈ నెల 28న నిర్వహించే బహిరంగ సభకు వైసీపీ ప్రభుత్వ బాధితులంతా రావాలని తెలుగుదేశం-జనసేన పార్టీలు పిలుపునిచ్చాయి.

ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోందని, త్వరలో విడుదల చేస్తామని సమావేశం ముగిసిన తర్వాత అచ్చెన్న మీడియాకు తెలిపారు. ఏయే స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనేది చంద్రబాబు, పవన్‌ నిర్ణయం తీసుకుంటారన్నారు. పొత్తులు పెట్టుకొనే సమయంలో కొన్ని త్యాగాలు తప్పవని, టికెట్లు కోల్పోయిన వాళ్లు బాధపడొద్దని అధినేతలిద్దరూ చెప్పారని గుర్తు చేశారు. టీడీపీ- జనసేన మధ్య గొడవలు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వాలంటీర్ల గురించి మాట్లాడిన మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు చేసినట్టు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story