చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత శివప్రసాద్ కన్నుమూత

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత శివప్రసాద్ కన్నుమూత

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. శివప్రసాద్ మూత్ర పిండాల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సుమారు 2 వారాల పాటు చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. ఇంతలోనే మరోసారి మూత్ర పిండాల్లో సమస్య తలెత్తడంతో గురువారం మళ్లీ చెన్నై ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆయన మృతిచెందినట్లు వైద్యులు ప్రటించారు..

2009,2014 లో చిత్తూరు లోకసభ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు శివప్రసాద్. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తిరుపతిలో డాక్టర్‌గా పని చేసిన శివప్రసాద్ నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశారు. ఎన్నో సినిమాల్లో నటించారు. 2006 సంవత్సరంలో విడుదలైన డేంజర్ సినిమాలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీలో నటనకు నంది అవార్డు కూడా వచ్చింది. ఇంకా అనేక సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించారు శివప్రసాద్. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వివాదం సాగినన్ని రోజులూ రోజుకో వేషంతో అందరినీ ఆకట్టుకున్నారు..

11 జూలై 1951న జన్మించారు నారమల్లి శివప్రసాద్. తల్లిదండ్రులు నాగయ్య, చెంగమ్మ. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్యకళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు శివప్రసాద్. పిబ్రవరి26, 1972 లో రాజ్యలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. సాహిత్యము, కళలు, సినిమా నటన వంటి అంశాలపై శివప్రసాద్ కు మక్కవ ఎక్కువ.

Tags

Read MoreRead Less
Next Story