AP: సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికుల అష్టకష్టాలు

AP: సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికుల అష్టకష్టాలు
జనాన్ని తరలించేందుకు 3 వేల 500 బస్సులు... మండిపడుతున్న ప్రయాణికులు

బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ నిర్వహించిన 'సిద్ధం' సభకు.... పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు కేటాయించడం సామాన్య ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెట్టింది. మేదరమెట్లలో సిద్ధం సభకు జనాన్ని తరలించేందుకు మొత్తం 3వేల 500 బస్సులు కేటాయించగా అన్ని బస్టాండ్ లలో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి 675 బస్సులు, చీరాల డిపో నుంచి 80 బస్సులు, నెల్లూరు జిల్లాలోని 6 డిపోల నుంచి 332 బస్సులు, ప్రకాశం జిల్లా మార్కాపురం డిపో నుంచి 70 బస్సులు వైసీపీ సిద్ధం సభకు కేటాయించారు.


అన్ని బస్సులు సిద్ధం సభకే వెళ్లగా ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. బస్సులు ఎప్పుడు వస్తాయని ఆర్టీసీ అధికారులను అడిగితే.. CM జగన్ ను అడగాలని ఆర్టీసీ సిబ్బంది సూచిస్తున్నారు. జగన్ సభ కోసం జాతీయ రహదారి రాకపోకలపై ఆంక్షలు విధించగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు నుంచి ఒంగోలు, చెన్నైకు వెళ్లే వాహనాలను బుడంపాడు అడ్డరోడ్డు నుంచి బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా దారిమళ్లిస్తున్నారు. చిలకలూరిపేట నుంచి ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే వాహనాలను దారిమళ్లించటంతో ప్రయాణికులు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది.


గుంటూరు జిల్లా నుంచి భారీగా బస్సులను సిద్ధం సభకు తరలించారు. పల్నాడు , బాపట్ల జిల్లాల్లో.... బస్సులు లేక ప్రాంగణాలు వెలవెలబోయాయి. గుంటూరు, నరసరావుపేట, తెనాలి, పొన్నూరు, పర్చూరు, పిడుగురాళ్ల, మాచర్ల, వినుకొండ ప్రాంతాలకు వెళ్లేందుకు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. చిలకలూరిపేట నుంచి సిద్ధం సభ జరుగుతున్న మేదరమెట్ల వైపు బస్సులను వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. చీరాల మీదుగా దారిమళ్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు.... మార్గమధ్యలో బస్సులు దిగి గమ్యస్థానాలకు ప్రైవేటు వాహనాల్లో వెళ్లిపోయారు. మంగళగిరి డిపోలో 23 బస్సులు ఉంటే వాటన్నింటినీ సిద్ధం సభకు తరలించారు.


సత్తెనపల్లిలో డిపోలో 45 బస్సులకు గాను 25 వాహనాలను సిద్ధం సభలకు తరలించారు. గ్రామాలకు వెళ్లాల్సిన ప్రజలు ఇబ్బంది పడ్డారు. పరిస్థితిని గమనించిన మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్నారు. ఆటోలు ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు పంపారు. చీరాల ఆర్టీసీ బస్టాండ్‌లో మొత్తం 96 బస్సులు ఉండగా 80బస్సులను సభకు పంపారు. చాలా సేపు బస్టాండ్‌లో వేచి ఉన్న జనం.. బస్సులు ఏవని అధికారులను నిలదీశారు. జగన్‌ను అడగాలని వారు దురుసుగా సమాధానం ఇచ్చారని ప్రయాణికులు వాపోయారు. ప్రకాశం జిల్లా కనిగిరి డిపో నుంచి 48 బస్సులను సిద్ధం సభకు తరలించారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు..ఎండలో ఆటోల కోసం నిరీక్షించారు. మార్కాపురం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే వారు ప్రైవేటు వాహనాల్లో వెళ్లిపోయారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వందల ఆర్టీసీ బస్సులను మేదరమెట్ల తరలించారు. తిరుపతి నుంచి తమిళనాడు, కర్ణాటకతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక జనం అవస్థలు పడ్డారు. తిరుపతి జిల్లా నుంచి 155, చిత్తూరులో 125 బస్సు సర్వీసులను సిద్ధం సభలకు కేటాయించారు. ఒకటీ రెండు బస్సులు వచ్చినా... వాటిల్లో సీట్ల కోసం జనం ఎగబడ్డారు. ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల బస్సులను వైకాపా నేతలు వదలలేదు. నెల్లూరులో ఆర్టీసీ బస్టాండ్ జనం లేక వెలవెలబోయింది. ఆరు ప్రధాన డిపోల నుంచి 332 బస్సులను వైకాపా సభకు తరలించారు. ప్రయాణికులను గాలికొదిలేసి పార్టీల సేవలో ఆర్టీసీ తరించడం దారుణమని జనం ఆక్షేపించారు.

Tags

Read MoreRead Less
Next Story