AP: జగనన్నా.. బ్యాండేజ్‌ తీయకపోతే సెప్టెక్‌ అవుద్దీ

AP: జగనన్నా..  బ్యాండేజ్‌ తీయకపోతే సెప్టెక్‌ అవుద్దీ
జగన్‌కు వైద్యులు సరైన సలహా ఇవ్వలేదన్న సునీత.... త్వరగా బ్యాండేజ్‌ తీయాలని హితవు

ముఖ్యమంత్రి జగన్‌పై ఆయన సోదరి, వై.ఎస్. వివేకా కుమార్తే.. వైద్య సలహా ఇచ్చారు. జగన్‌ తలపై ఆ బ్యాండేజ్‌ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్‌ అవుతుందని అన్నారు. వైద్యులు సరైన సలహా ఇవ్వలేదన్న ఆమె.. జగన్‌ త్వరగా బ్యాండేజ్‌ తీయాలని ఒక డాక్టర్‌గా సలహా ఇస్తున్నట్టు చెప్పారు. గాలి తగిలితేనే గాయం త్వరగా మానుతుందన్నారు. నామినేషన్‌ సందర్భంగా సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై సునీత స్పందించారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇవాళ జగన్‌ చేసిన వ్యాఖ్యల్లో వివేకాపై ద్వేషం కనిపిస్తోందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. మీ కోసం త్యాగం చేశారు కాబట్టే.. వివేకాపై కోపమా? సీఎం జగన్‌కు న్యాయవ్యవస్థ, సీబీఐపై నమ్మకం లేదా అని ప్రశ్నించారు.


ఏ వ్యవస్థపై నమ్మకం ఉందో చెప్పాలని జగన్‌ను సునీత నిలదీశారు. హత్యపై మాట్లాడవద్దంటూ కోర్టు ఆర్డర్‌ తెచ్చిన వాళ్లే మాట్లాడుతున్నారన్నారు. సీబీఐ నిందితులు అని చెప్పిన వాళ్లకు ఓట్లు వేయవద్దని... తప్పు చేసి ఉంటే నాకైనా, నా భర్తకైనా శిక్ష పడాల్సిందేనని అన్నారు. అవినాష్‌రెడ్డి చిన్న పిల్లోడని చెబుతున్నారు.. ఎంపీ పదవులు పిల్లలకు ఇస్తారా? సీబీఐ నిందితులు అన్న వాళ్లను జగన్‌ ప్రోత్సహిస్తున్నారు. ఐదేళ్లుగా నా తండ్రి హత్యపై పోరాడుతుంటే రాజకీయాలు అంటగడుతున్నారు. సీఎంను ప్రాధేయపడుతున్నా.. ఇప్పటికైనా నా పోరాటానికి సహాయం చేయండని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు సీఎం జగన్‌కు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వడం ధర్మమా అని ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు మద్దతు ఇవ్వకపోగా... ఆమెపైనా, షర్మిలపైనా నిందలు వేయడం ఎంతవరకు సబబని నిలదీశారు. సొంత చెల్లెళ్లపై సాక్షి మీడియాలో వ్యతిరేక వార్తలు రావడం బాధగా ఉందని సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల బహిరంగ సభలో వివేకా హత్యపై జగన్ మాట్లాడుతుండగానే... వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ విడుదల చేశారు. 2009లో తండ్రిని కోల్పోయినప్పుడు జగన్‌ ఎంత మనోవేదన అనుభవించారో... 2019లో సునీత కూడా అంతే బాధ అనుభవించిందన్నారు. నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు తమను మరింత ఎక్కువగా బాధ పెట్టాయని సౌభాగ్యమ్మ లేఖలో ప్రస్తావించారు. కుటుబంలోని వారే హత్యకు కారణం కావడం... వాళ్లకు సీఎం రక్షణగా ఉండటం తగునా అని జగన్‌ను ప్రశ్నించారు. జగన్‌ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నను ఈ విధంగా... సాక్షి పత్రిక, టీవీ ఛానల్‌, సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం చేయించడం ఎంతవరకు సబబని సౌభాగ్యమ్మ ప్రశ్నించారు..

Tags

Read MoreRead Less
Next Story