Sirivennela Seetharama Sastry : 'సిరివెన్నెల' ఇక కురవదు.. 'సీతారామశాస్త్రి' ఇక లేరు..
Sirivennela Seetharama Sastry ( File photo)
sirivennela seetharama sastry : తెలుగు సినిమా సాహిత్యంపై సిరివెన్నెలలు కురిపించిన కలం.. అమావాస్య అయింది. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అన్న ఆ సాహితీ కారుడు.. కాలం కత్తికి తల దించక తప్పలేదు. చిన్న అనారోగ్యమే అనుకున్నారంతా.. కానీ అది ఆయువును తీసేంత పెద్దదని ఈ క్షణం వరకూ ఎవరికీ తెలియలేదు. రెండు రోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో జాయినయ్యారు. డాక్టర్లు ఆయన ప్రాణాలు కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. సీతారామశాస్త్రి ఊపిరి ఆగిపోయింది.
తెలుగు సినిమా సాహిత్యానికి ఓ ఆత్రేయ, ఓ ఆరుద్ర, ఓ వేటూరి అని చెప్పుకున్న వాళ్లం ఇక ఓ సిరివెన్నెల అనీ చెప్పుకోవాల్సి రావడం దురదృష్టం. మరణం ఎవరికైనా అనివార్యమే. కానీ కొన్ని మరణాలు లక్షల హృదయాలను వేదనకు గురిచేస్తాయి. అలాంటి వేదనను అభిమానులకు మిగిల్చి ఆ సాహితీ సిరివెన్నెల ఈ గాలి ఈ నేల ఈ ఊరిని వదిలి దివికేగింది.
తెలుగు సినిమా ఒక్కో దిగ్గజాన్ని కోల్పోతోంది. బాలసుబ్రహ్మణ్యం పోయి యేడాది కాకుండానే ఇప్పుడు సిరివెన్నెల. తన పాటలకు గాత్రంతో ప్రాణం పోసిన గళం చెంతకే కలం వెళ్లిపోయింది. తెలుగు సినిమా సాహిత్యంలో సిరివెన్నెలది ప్రత్యేక ప్రస్థానం. సినిమా పాటతో లక్షలాది మస్తిష్కాలను వెలిగించిన కలం ఆయనది. ద్వందార్థాల పదాలను దరిచేరనీయక.. సినీ, సమాజహితంగా సాగిన కలం ఆయనది. అలాంటి కలం శాశ్వతంగా ఆగిపోయిందనే మాట హృదయాల్ని మెలిపెడుతూ.. కనుకొలను కట్టలు తెంచుకుని కన్నీటి ప్రవాహమైన క్షణం ఇది.
చేబ్రోలు సీతారామశాస్త్రి.. తెలుగు సినిమా సాహిత్యంలో సిరివెన్నెలై ఉదయించాడు. విధాత తలపున ప్రభవించిన ఆ అక్షరం.. అనలమైన భావాల వేదికగా తెలుగు సినిమా సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది. అద్వైతం నుంచి రొమాన్స్ వరకూ.. మేల్కొలుపు నుంచి హెచ్చరికల వరకూ ఆ అక్షరాలు పలకని భావం లేదు. చెప్పని సందేశం లేదు. నిద్రపోతోన్న సమాజాన్ని నిగ్గదీసి అడిగాయి. సురాజ్యం కాలేని స్వరాజ్య కాంక్షను హేళన చేశాయి. తోడు లేని నడక ఎడారి పాలే అని తేల్చివేశాయి. సంతోషమే సగం బలం అని పాటల పల్లకిపై రారాజులా ఊరేగిన అక్షరాలు సిరివెన్నెల సీతారామశాస్త్రివి.
అడవిగాచిన వెన్నెల అన్న సామెతని వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా అంటూ మార్చిన చమత్కారం.. ఆయన సొంతం. ఇదే సీతారామశాస్త్రి ప్రత్యేకత.. మనకు తెలిసిందే అయినా మన ఊహలకు తనదైన శైలిలో అక్షర రూపమిచ్చి అబ్బురపరుస్తాడు. వాడుక మాటల నుంచి ఛందస్సు గీతాల వరకూ సింపుల్ గా మార్చడం సీతారామశాస్త్రి స్టైల్.
కె.విశ్వనాథ్ వల్ల వెలుగులోకి వచ్చిన సీతారామ శాస్త్రి "సిరివెన్నెల" సినిమాలో అన్ని పాటలు హిట్ అయ్యాయి కాబట్టి, ఈజీగా సినీ రంగంలో స్థిరపడ్డారు అనుకుంటారు.. కానీ సిరివెన్నెల తరువాత వచ్చిన అవకాశాలను ఆయన ఉపయోగించుకో లేకపోయారు. ఈయన సిరివెన్నెల లాంటి వాటికి తప్ప కమర్షియల్ సినిమాలకు పనికి రాడనే పేరు వచ్చేసింది. సరిగా అప్పుడే దర్శకుడు వంశీ సిరివెన్నెల టాలెంట్ ను పసిగట్టాడు. ఆయనలోని గొప్ప సాహిత్యాన్ని తెలుగువారికందించే పని పెట్టాడు.
సీతారామశాస్త్రిలో కమర్షియల్ గా రాస్తూనే కవితాత్మను వదలని లక్షణాన్ని గమనించారు వంశీ. దాంతో ఆయనకు కమర్షియల్ బాణీ అలవాటు చేశారు. అలా వచ్చిందే లేడీస్ టైలర్. ఇక వేటూరిలా అలవోకగా రాయలేని ఇబ్బందికి ఓ చిట్కా కనిపెట్టి పరిష్కరించుకున్నారు. అదే ఈవెనింగ్ సిట్టింగ్స్... సాయంత్రం సందర్భం చెప్పించుకుంటే రాత్రంతా టైం వస్తుందని కనిపెట్టారాయన. అలా సీతారామ శాస్త్రి హిట్టయ్యారు.
కాస్త ఆలస్యం అయినా శాస్త్రిగారి కలం వెండితెరపై విహరించింది. సందర్భానికి తగ్గట్టుగా పాటలు రాయాలి.. ఆ సందర్భం ఏదైనా సాహిత్యం విరబూయాలి అనుకునే నైజం ఆయనది. అందుకే నమ్మకు నమ్మకు ఈ రేయిని.. అంటూ హెచ్చరికలు చేశాడు.. జామురాతిరీ జాబిలమ్మలా జోలపాడాడు. ఆకాశంలో ఆశల హరివిల్లూ.. ఆనందాలే పూసిన పొదరిల్లూ అంటూ సుందర స్వప్నలోకాల్నీ కలగనమన్నాడు.
తెల్లాంరింది లెగండో అంటూ ఆయన కలమే కాదు.. గళాన్నీ వినిపించిన తీరు ఎంతో ఆకట్టుకుంటుంది. కళ్లు సినిమా కోసం సీతారామాశాస్త్రి తొలిసారిగా పాడిన ఈ పాట గొంతులు తిరిగిన గాయకుడు పాడినట్టే ఉంటుంది.
సిరివెన్నెల కలానికి బలమెక్కువ.. అది అగ్నిధారలు కురిపిస్తుంది. అమృతవాక్కులూ అందిస్తుంది. సమాజాన్ని జాగృతం చేస్తుంది.. నిస్సహాయతలో దారీ చూపుతుంది. మంగళ సూత్రం అంగడి సరుకా అని అత్యాశ కలిగిన ఆడవారికి ఎలా ఉద్భోదిస్తాడో.. మగాడి స్పర్శతోనే శీలం పోతుందంటే ఇల్లాలు కూడా పతివ్రత కాదు కదా అంటూ తనదైన శైలిలో సమాజాన్ని ప్రశ్నిస్తాడు. ఇలాంటి ప్రత్యేకతలు ఆ పాళీలో ఎన్నో ఉన్నాయి. అందుకే సీతారామశాస్త్రి అంటే సినీవినీలాకాశంలో కృష్ణపక్షం లేని సిరివెన్నెల.
''సినిమాని చీప్ ఆర్ట్ గా చాలమంది భావిస్తారు. అలాగే సినిమా కవుల్నీ. సినిమాకవి మామూలు కవి కంటే గొప్పవాడు. పాత్రలోకి ప్రవేశించి పాత్రతో అనిపించగలడు. అయినా సినిమాకి కావ్య గౌరవం సినీ పాటకి సాహిత్య గౌరవం రావడం లేదు'' అంటూ ఎన్నో సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు సిరివెన్నెల.. నిజమే.. సినిమాలు చూసి ఎంతో వినోదాన్ని పొందినా.. సినిమా వాళ్లంటే మాత్రం ఎక్కడో చిన్నచూపు కలిగి ఉంటారు కదా కొందరు.
మనిషి మనసులోని భావాలు, ఆలోచనలను బట్టే చుట్టూ ఉన్న పరిస్థితులు మారతాయి. ఈ సత్యాన్ని తెలిపేలా సీతారామశాస్త్రి ''ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు'' అంటూ జీవన గమనాన్ని ప్రేమించిమంటాడు.. ''ఎప్పుడూ ఒప్పుకో వద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకో వద్దురా ఓరిమి'' అంటూ నిరంతర ప్రయత్నంతో నిరాశకే నిరాశ పుట్టించి, గెలుపు తలుపులు తెరుచుకునే విధంగా చేయొచ్చుని ప్రోత్సాహమందిస్తాడు సిరివెన్నెల..
సీతారామశాస్త్రి.. జగమంతా తన కుటుంబమన్న తాత్వికుడు.. ఆకాశంలో ఆశల హరివిల్లులు చూసిన స్వాప్నికుడు.. సిగ్గులేని జనాన్ని నిగ్గదీసినవాడు.. బోసినోటి తాత కీర్తిని భగవద్గీత గా వినిపించినవాడు.. పూలబాలల కేల మూణ్ణాళ్ళ ఆయువని శివుడితోనే నిష్టూరమాడిన ప్రకృతి ప్రేమికుడు.. చంద్రుళ్ళో ఉండే కుందేటిని నేలకి దింపిన భావుకుడు.. అలాగే సముద్రాన్ని కన్నె పిల్ల కన్నుల్లో కన్నీటి అలలుగా మార్చినా నేననీ నీవనీ వేరుగా లేమని అంటూ యువ హృదయాల్ని ఊయలలూపినా అది సిరివెన్నెలకే చెల్లింది.
చక్రవర్తికి వీధి బిక్షగత్తెకు బంధువంది మనీ మనీ అనడం ఎంత అవగాహనతో కూడిన ప్రయోగం. భద్రంబీకేర్ ఫుల్ బ్రదరూ భర్తగ మారకు బ్యాచులరూ అంటూ ఫన్నీగానే చెప్పినా పర్ఫెక్ట్ గా చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతే కాదు చదువుకున్న పరమార్థం మార్కులు, ర్యాంకులు కాదని చెబుతూ బోడి చదువులు వేస్టూ నీ బుర్రంతా భోంచేస్తూ అనడం శాస్త్రిగారి కలానికే చెల్లింది.
సాహిత్యం విలువ తెలిసిన చోట సీతారామశాస్త్రి కలం పరుగులు పెడుతుంది. తనకే సొంతమైన అనేక భావాలను వెండితెర వేదికగా విరజిమ్ముతుంది. అలాంటి చోటు తనకు కె విశ్వనాథ్ చెంత కాస్త ఎక్కువగా దొరికింది. కె విశ్వనాథ్, బాలసుబ్రహ్మణ్యం, సీతారామశాస్త్రి చేసిన సాహితీ సేద్యం తెలుగు సినిమాకు మాత్రమే దొరికిన ఓ వరం.
పాట నాకు ఇష్టమై రాసుకుంటాను. నిర్మాత, దర్శకులకు నచ్చింది కాబట్టి తీసుకుంటున్నారు. వాళ్లకు నచ్చినట్లు రాయడమంటే నేను రాజీపడ్డానని కాదు. నాకు పూర్తిగా సంతృప్తి చెందినప్పుడే పాట బయటకు వస్తుంది"అనేవారు సీతారామశాస్త్రి. అంతే కాదు.. సినిమా పాటలు అన్ని రకాల శ్రోతలు వినేవి. వాటిని విన్నవారు ప్రభావితం కావచ్చు, కాకపోవచ్చు. కాని.. నా పాట సమాజంలో చెడు ప్రభావాన్ని మాత్రం చూపకూడదు. ఏ రకంగానూ ఎవరి ఆత్మస్థయిర్యాన్ని, మనో నిబ్బరాన్ని దెబ్బతియ్యకూడదు. నా పాట సమాజంలో ఆశావహ దృక్పథాన్ని పెంపొందించాలే తప్ప నిరాశావాదాన్ని తీసుకురాకూడదు" అన్నది ఆయన సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్నే ఆఖరి పాట వరకూ పాటించారు.
రవళించే రాగాలకు కమనీయపు రూపమిచ్చి, సంగీతపు సంద్రానికి ఉప్పెనలా పొంగునిచ్చి, చిన్ని పూరేకు లాంటి పాటకు చిరు చినుకులా ప్రాణమిచ్చి, అలసిపోని అలలాగా కరిగిపోని కలలాగా నిలిచి ఎన్నో హృదయాలను గెలిచిన కలం సితారామశాస్త్రిది. అందుకే ఆయనకు పద్మశ్రీ వచ్చినప్పుడు.. పద్మశ్రీకే సిరివెన్నెల వచ్చిందన్నాం మనమంతా. మళ్లీ కొత్తపాటలేం రాకపోయినా.. పాట అనే పదం ఉన్నంత వరకూ సీతారామశాస్త్రి పంచిన పాటల పాదాలు శాశ్వతంగా నిలిచే ఉంటాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com