రూ.5 కోట్లు విలువజేసే నిషేధిత సముద్ర దోస(Sea Cucumber) సీజ్‌!

రూ.5 కోట్లు విలువజేసే నిషేధిత సముద్ర దోస(Sea Cucumber) సీజ్‌!
సముద్ర దోసకాయ(Sea Cucumber) స్మగ్లర్లకు చెక్‌ పెట్టిన ఇండియన్ కోస్ట్ గార్డ్

రామనాథపురం జిల్లా, మండపం సమీపంలో సముద్రంలో స్మగ్లర్లు డంప్‌ చేసిన సుమారు 1,137 కిలోల నిషేధిత సముద్ర దోస(Sea Cucumber) లభ్యమైంది. రూ. 5.11 కోట్ల విలువైన ఈ సరుకును స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ)‌ గురువారం వెల్లడించింది. గత రెండు నెలల్లో నిషేధిత దోసలు ఐసీజీ చేతికి చిక్కడం ఇది రెండో సారి. మే 10న ఎడయార్వలసై సముద్రతీరంలో దాదాపు 260 కిలోల నిషేధిత సముద్ర దోసకాయలను ఐసీజీ స్వాధీనం చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ICG బృందం గజ ఈతగాళ్ల సహాయంతో సమగ్ర శోధన చేసి నిషేధిత దోసల జాడ కనిపెట్టింది.

మండపం పట్టణానికి దక్షిణంగా వెదలై బీచ్ సమీపంలోని నీళ్లలో స్మగ్లర్లు డంప్ చేసిన సుమారు 67 గన్నీ బ్యాగులు లభ్యమయ్యాయి. మరోవైపు రామనాథపురం జిల్లా పనైకులం వద్ద 540 కిలోల సముద్ర దోసకాయను అటవీ సిబ్బంది పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒక వ్యాను, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని పనైకులంకు చెందిన ఎస్ జెబమలై (46), వెతలైకి చెందిన కె. మునియసామి (31), అదే ప్రాంతానికి చెందిన నంతకుమార్ (19)లుగా గుర్తించారు. రామనాథపురం రేంజ్‌లోని అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఎన్.‌ సురేష్‌ కుమార్‌ నేతృత్వంలోని బృందం పనైకులం వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యాన్‌ను అడ్డగించగా, అందులో తాజా సముద్ర దోసకాయలతో కూడిన ముప్పై గన్నీ బ్యాగులు కనిపించాయి. కీలక నిందితుడు కుప్పాయి అలియాస్ సీని అబ్దుల్ రెహమాన్ పరారీలో ఉన్నాడని, గాలింపు చర్యలు ప్రారంభించామని అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తెలిపారు.





సముద్ర దోసకాయలు ఓ రకమైన జలాంతర జీవులు. చైనా, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లో ఔషధాలు, ఆహారంలో వినియోగానికి భారీ డిమాండ్ ఉంది. కానీ, వీటిని ఎక్కువగా వేటాడం వల్ల ఆ జాతి అంతరించిపోతుందని 1972 వన్యప్రాణుల రక్షణ చట్టంలోని షెడ్యూల్ I ప్రకారం సీ కుకుంబర్ వేటను నిషేధించారు.

Tags

Read MoreRead Less
Next Story