వినాయక చవితిలో దాగి ఉన్న రహస్యం

హిందువుల పండుగల్లో వినాయక చవితి ప్రత్యేకం. తొమ్మిది రోజులు పాటు నిర్వహించే గణపతి పూజలో ఆధ్యాత్మిక, ఆయుర్వేద, పర్యావరణానికి సంబంధించిన ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి. వినాయకుడికి ఎన్నో పేర్లు. గణేశుడు, విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు.. ఇలా ఎన్నో నామాలు. ఏ కార్యక్రమం మొదలు పెట్టినా, తొలి పూజ అందుకునేది విఘ్ననాథుడే. మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే.

సర్వ విద్యలకు మూలం.. సకలవేదాల సారం గణపయ్య.. ఉపనిషత్తుల అంతరార్థం.. సర్వ పురాణాల సంక్షిప్త రూపం కూడా. ఏనుగు తల నుంచి ఎలుక వాహనం వరకూ రూపమంతా ప్రతీకాత్మకమే. పెద్ద తల గొప్పగా ఆలోచించమని చెబుతుంది. చిన్న కళ్లు చూపు లక్ష్యం వైపే ఉండాలన్న సత్యాన్ని చూపిస్తాయి.

వినాయక చవితిని భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు జరుపుకుంటాం. ఈరోజే గజాననునికి విఘ్నాదిపత్య బాధ్యతలు అప్పగించబడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే బొజ్జ గణపయ్య అనుగ్రహం కోసం చవితి పండుగను ఘనంగా జరుపుకుంటాం. వినాయక చవితి వచ్చిందంటే చాలు పెద్దలతో పాటు పిల్లలకూ సంతోషమే. తొమ్మిది రోజులూ భక్తిభావంలో మునిగిపోతారు. ఊరూరా, వాడవాడలా గణపతి విగ్రహాలను ప్రతిష్టించి శాస్త్రోక్తంగా 9రోజులు పూజలు చేసి నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఈ సంబరాలను యావత్‌ భారతదేశం ఎంతో కోలాహలంగా జరుపుకుంటుంది.

గణపతి పుట్టుక, పూజ నుంచి నిమజ్జనం వరకూ ప్రతిదానిలో సామాజిక, ఆయుర్వేద, ఇతర పర్యావరణ కోణాలు దాగున్నాయి. కొత్త మట్టితో వినాయకుని ప్రతిమ తయారు చేసి, దానికి 21 పత్రాలతో పూజ చేసి, నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేస్తారు. తరతరాలుగా గణపతి పూజా విధానం ఇలాగే జరుగుతూ వస్తోంది.

మట్టి వినాయకుడి విగ్రహాన్నే పూజించాలని పెద్దవాళ్లు చెప్పేవాళ్లు. ఎందుకంటే, పంచభూతాల్లో ఒకటైన ఈ మట్టి.. సర్వమానవాళికి అందుబాటులో ఉండేది. ఈ మట్టిలోంచే సకల ప్రాణులు , సంపదలు వచ్చాయని పెద్దవాళ్లు చెబుతారు. ఇక మట్టి విగ్రహాలు చేయమనడం సర్వమానవాళి సుఖశాంతుల కోసమే. వినాయక నిమజ్జనంలోనూ ప్రకృతి నియమం దాగుంది. చెరువులు, బావులు, నదులు వర్షాలవల్ల కలుషితం కావడం సర్వసాధారణం. ఈ నీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రి ఉపయోగపడుతుందట. 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితోపాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేస్తారు. అలా నీటిలో కలిసిన మట్టి, పత్రి  నిమజ్జనం తర్వాత తమలోని ఔషధ గుణాల ఆల్కలాయిడ్స్‌ని ఆ నీళ్లలోకి వదిలేస్తాయట. అవి బాక్టీరియాను నిర్మూలించి, జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయని అంటారు. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం.

 

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *