చెయ్యి కాలిందని ఇంటి వైద్యం చేసుకునేసరికి..

చెయ్యి కాలిందని ఇంటి వైద్యం చేసుకునేసరికి..

పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదని పెద్దలు ఊరికే అనలేదు. కొన్ని చిట్కాలు ఉపశమనం ఇస్తాయేమో కానీ అదే పర్మినెంట్ సొల్యూషన్ కాదు. అయినా వ్యాధి తీవ్రతను బట్టి వైద్యుని సంప్రదించడమే మంచిది. చిన్నదైతే వంటింటి చిట్కా పనికొస్తుందేమో కానీ అన్నింటికీ అదే పరిష్కారం అనుకుంటే పొరపాటే. మలేసియాకు చెందిన ఓ మహిళకి చేయి కాలేసరికి ఎక్కడో విన్న చిట్కా ఒకటి పాటించి గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నట్లయింది. కాలిన గాయాలకు టూత్ పేస్ట్ రాసుకుంటే తగ్గుతుందన్న చిట్కా పాటించి, చివరికి ఆసుపత్రి పాలైంది. అసలే కాలింది.. ఆపై పేస్ట్ రాసింది. దాంతో పేస్ట్‌లో ఉండే కెమికల్స్ వల్ల చెయ్యి నొప్పి తగ్గకపోగా చేయంతా బెలూన్‌లా ఉబ్బిపోయింది. దీంతో ఆసుపత్రి పరిగెట్టేసరికి వైద్యులు పరీక్షలు చేసి.. కాలిన గాయాలకు ఇంటి వైద్యం చేసుకోవద్దని హెచ్చరించారు. అలా చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసిన డాక్టర్ కమరుల్ అరిఫిన్.. చాలా మంది కాలిన గాయాలకు నూనె, సోయాసాస్, గుడ్లు లేదా మీగడ రాస్తారని తెలిపారు. ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభించినా.. రియాక్షన్ వస్తే పెద్దది అవుతుందని అన్నారు. ఇంకా కాలిన గాయాలపై చల్లని నీరు లేదా ఐస్ లాంటివి కూడా పెట్టకూడదన్నారు. డాక్టర్ ట్వీట్ వైరల్ కావడంతో పలువురు నెటిజన్స్ తమ సందేహాలను వెలిబుచ్చారు. కాలిన గాయాలకు కలబంద రాస్తాము మంచిదేనా అంటూ కొందరు అడిగితే.. చిన్న చిన్న వాటికి మంచిదే.. కానీ గాయాల తీవ్రతను బట్టి వైద్యులను సంప్రదించడం అవసరమని అన్నారు. ఈ నేపథ్యంలో కాల్గెట్ కూడా వినియోగదారులకు హెచ్చరికలు చేసింది. టూత్ పేస్టులో దంతాలను శుభ్రం చేసుకోవడానికి అవసరమైన డిటర్జెంట్లు ఉంటాయి. దాన్ని తీసుకుని కాలిన గాయాలకు రాయడం మంచిది కాదు అని తెలిపింది. కాబట్టి పేస్ట్ రాసి మీ గాయాలను పెద్దవి చేసుకోకండి అని వినియోగదారులకు తెలియజేసింది.

Read MoreRead Less
Next Story