కావలి వైసీపీలో వసూల్ రాజా..!

కావలి వైసీపీలో  వసూల్ రాజా..!
కావలి MLA వసూల్ రాజా అవతారమెత్తారా? MLA దెబ్బకి వసూళ్లు చేయలేక క్యాడర్ హడలిపోతుందా? కార్యక్రమమేదైనా కోట్లలో వసూళ్లు చేస్తున్నారా? సొంత సామాజిక వర్గానికే పనులు కట్టబెడుతున్నారా? MLA తీరుతో ద్వితీయ శ్రేణి నేతలు గుర్రుగా ఉన్నారా?

నెల్లూరు జిల్లా కావలి MLA రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై సొంత పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. జగన్ టూర్, MLA బర్త్‌డే వేడుకల పేరుతో కోట్లలో వసూళ్లకు పాల్పడుతుండటంతో నియోజకవర్గంలో వ్యాపార సంఘాలు హడలిపోతున్నట్లు సమాచారం. MLA మనుషులు వస్తున్నారంటే విరాళాలు ఇవ్వలేక భయపడే పరిస్థితులు నెలకొన్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కావలి MLA రియల్ ఎస్టేట్.. శాండ్.. ల్యాండ్.. గ్రావెల్.. దందాలలో సిబ్బందిని రిక్రూట్ చేసుకుని వసూళ్ల రాజా అవతారమెత్తారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఈ మధ్య కాలంలో మరింత శృతిమించినట్లు తెలుస్తోంది. ఇటీవల CM జగన్మోహన్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో భాగంగా కావలి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ వసూళ్లకు తెర తీశారట. బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ సభ్యులను కోటి 20 లక్షలు డిమాండ్ చేయడంతో 60 లక్షలు ఇచ్చి ఈ సారికి అడ్జస్ట్ చేసుకోవాలని వేడుకున్నట్లు సమాచారం. అధికారులు వివిధ వ్యాపార సంఘాల నుంచి ముఖ్యమంత్రి కార్యక్రమానికి మూడు కోట్ల రూపాయలు వరకు వసూలు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవన్నీ ఒక ఎత్తయితే రాచరికపు సాంప్రదాయం రాజుల జమానాని గుర్తుచేస్తూ ఎమ్మెల్యే రామిరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వివిధ వర్గాల నుండి 70 లక్షల రూపాయలు ముక్కు పిండి వసూళ్ళు చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. MLA అక్రమ వసూళ్లను ప్రశ్నించిన BC నేత, BJP జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్‌పై తన అనుచరులతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేయిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా MLA ప్రతాప్ కుమార్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. తన పుట్టినరోజు వేడుకలను ఎలా జరపాలో ద్వితీయ శ్రేణి నేతలతో సమీక్షలు నిర్వహించి ఆదేశాలు జారీ చేయడంతో సొంత పార్టీ నేతలు సైతం విస్తుపోతున్నారు. పుట్టినరోజుకి 15 రోజుల ముందు నుండే సోషల్ మీడియాను హోరెత్తిస్తూ తన అనుచరులతో చేయించిన హడావిడికి పట్టణ ప్రజలు ఇదేం పైత్యం అంటూ ముక్కున వేలేసుకున్నారు. పుట్టిన రోజు నాడు అన్నదానాలు, రక్త దానాలు, సేవా కార్యక్రమాలతో కావలి పట్టణం హోరెత్తి పోవాలంటూ ద్వితీయ శ్రేణి నేతలకు MLA హుకుం జారీ చేసినట్లు YCPలో చర్చ జరుగుతోంది.

అంతే కాదు.. MLA ఒంటెద్దు పోకడలతో ద్వితీయ శ్రేణి నేతలు మండిపడుతున్నారు. ఆదాయం వచ్చే పనులు సొంత సామాజిక వర్గానికి కట్టబెడుతూ..ఖర్చులు, విరాళాలు మాత్రం మా వద్ద వసూలు చేస్తున్నారని ద్వితీయ శ్రేణి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే రాచరికపు పోకడలకు ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎమ్మెల్యేని వదిలించుకుకోవాలని నియోజకవర్గ ప్రజలు యోచిస్తున్నారట. నాలుగేళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు మినహాయించి.. ద్వితీయ శ్రేణి నేతలనెవ్వరిని కూడా దగ్గరకు రానివ్వకపోవడం సెకండ్ క్యాడర్ నేతల్లో అసంతృప్తికి కారణమన్న చర్చ నడుస్తోంది.

MLAకి కావలిలో గ్రాఫ్ ఆమాంతం పడిపోవడం.. ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతున్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అదే సమయంలో ప్రతిపక్ష TDPకి ప్రజల్లో విపరీతమైన క్రేజ్ లభిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ సారధి కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కావలి నియోజకవర్గ TDPలో వరుస చేరికలతో YCP మరింత బలహీనంగా మారుతోంది.

Tags

Read MoreRead Less
Next Story