రాయలసీమను ముంచెత్తిన వరద.. నిద్రలేచి చూసేసరికి..

Read Time:0 Second

రాయలసీమలో మూడు జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించిపోయింది. నదీ పరివాహక ప్రాంతాలను వరద చుట్టు ముట్టడంతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు జనం.

భారీ వర్షాలకు కర్నూలు జిల్లా నంద్యాల రెవెన్యూ డివిజన్‌ అతలాకుతలమైంది. వాగులు, పంట కాల్వలు పొంగి పొర్లాయి. రహదారులు కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. తెల్లవారు జామున ప్రజలు నిద్రలేచే సమయానికి ఇళ్లలోకి నీరు వచ్చింది. అటు ఆళ్లగడ్డ మండలంలో వక్కిలేరు, నల్లవాగు పొంగిపొర్లడంతో పలు గ్రామాలు జలమయం అయ్యాయి.

భారీ వర్షాలతో కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రం గతంలో ఎన్నడూ లేనివిధంగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి బయట ఉన్న రెండు కోనేర్లతోసహా ఆ ప్రాంతాన్ని వరదనీరు ముంచెత్తింది. రుద్రగుండం పుష్కరిణిలో ఉన్న పంచలింగాలపైకి నాలుగు అడుగుల ఎత్తు మేర నీరు చేరింది. దీంతో భక్తులు స్వామివారి దర్శనం చేసుకోలేకపోయారు. ప్రధాన అర్చకులు ఆ వరదనీటిలోనే వెళ్లి మహానందీశ్వరస్వామి, కామేశ్వరి అమ్మవార్లకు అభిషేకార్చనలు చేశారు.

అవుకు-కోవెలకుంట్ల మధ్య పాలేరు వాగులో బస్సు ఇరుక్కుంది. దీంతో బస్సును ట్రాక్టర్ల సహాయంతో గ్రామస్తులు వెనక్కి లాగారు. బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రాళ్లవాగు, నల్లమల అడవి నుంచి వచ్చే పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మహానంది- నంద్యాల, మహానంది- ఒంగోలు జాతీయరహదారి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు రైల్వే ట్రాక్‌పై భారీగా నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అటు కడపజిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కుందూ, పెన్నా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రొద్దుటూరు కామనూరు వద్ద కందూ ప్రవాహంతో ఆటో కొట్టుకుపోయింది. దీంతో ముగ్గురు గల్లంతయ్యారు. అటు చాపాడు ,  రాజుపాలెం , దువ్వూరు మండలాల పరిధిలోని పలు గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. పెద్దముడియం, నెమళ్ల దిన్నె గ్రామాలను వరద నీరు చుట్టిముట్టింది. కుందూ నది ప్రవాహంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

పులివెందుల నియోజకవర్గంలోనూ భారీ వర్షం కురిసింది. పట్టణంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బస్టాండ్‌లో నీరు చేరింది. లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేముల, వేంపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి వాగులు ఉగ్రరూపం దాల్చాయి. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close