BJP manifesto : ఉత్తరప్రదేశ్‌లో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో అధికారం కోసం భారీ హామీలతో ముందుకొచ్చింది బీజేపీ. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సాగుచట్టాలు, రైతులపై నుంచి మంత్రి కుమారుడే కారు ఎక్కించడం వంటి చర్యల కారణంగా.. రైతులకు మేనిఫెస్టోలో పెద్దపీట వేసింది. యూపీ సంకల్ప్ పత్ర్ పేరుతో కేంద్రమంత్రి అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్ మేనిఫెస్టో విడుదల చేశారు. రైతులు, మహిళా ఓట్లే లక్ష్యంగా భారీ తాయిలాలు ప్రకటించారు.
మరోసారి బీజేపీని గెలిపిస్తే రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. చెరకు రైతులే లక్ష్యంగా బీజేపీ కూడా మేనిఫెస్టో విడుదల చేసింది. 15 రోజుల్లోనే చెరుకు పంట బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు యోగి. ఇది కేవలం ఎన్నికల మేనిఫెస్టో కాదని, యూపీలోని 24 కోట్ల జనాభాకు లోక కల్యాణ సంకల్ప్ పత్రమని సీఎం యోగి స్టేట్‌మెంట్ ఇచ్చారు.
యూపీ బీజేపీ మేనిఫెస్టోలో మహిళలకు కూడా వరాలు కురిపించారు. రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కన్యా సుమంగళ యోజన పథకం కింద అందించే ఆర్థిక సాయాన్ని 15వేల నుంచి 25వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది. హిందూ అమ్మాయిల జోలికి ముస్లిం యువకులు రాకుండా యూపీలో లవ్ జిహాద్ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేస్తామని కమలదళం మేనిఫెస్టోలో పెట్టింది.
ఉత్తరప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉందని, ఆర్థిక వృద్ధిలోనూ నెంబర్‌వన్‌గా నిలుపుతామని యోగీ ప్రభుత్వం హామీ ఇస్తోంది. తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం ద్వారా యూపీని నంబర్‌వన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని బీజేపీ మేనిఫెస్టోలో మాటిచ్చింది. కొత్తగా మరో ఆరు మెగా ఫుడ్ పార్కులను నెలకొల్పుతామని చెప్పింది. యూపీ బీజేపీ మేనిఫెస్టోలో జాతీయవాదం, అభివృద్ధి, సుపరిపాలన అంశాలు కూడా ప్రధానంగా ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com