కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కృష్ణా  జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court: మధ్యవర్తిత్వం ద్వారానే కృష్ణా జల వివాదాన్ని పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు.

Supreme Court: మధ్యవర్తిత్వం ద్వారానే కృష్ణా జల వివాదాన్ని పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ NV రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తాను న్యాయపరమైన అంశాలలోకి వెళ్లదలచుకోలేదని CJI స్పష్టం చేశారు. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వాడినని చెబుతూ.. తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదం పరిష్కారానికి సిద్దపడినట్లైతే సమాఖ్య స్పూర్తికి, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఈ వివాద పరిష్కారానికి తోడ్పాటునందిస్తానన్నారు.

అలా కాకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతరుల జోక్యంతో న్యాయపరంగా దీన్ని పరిష్కరించుకోవాలనుకుంటే ఈ కేసు విచారణను మరొక ధర్మాసనానికి బదిలీ చేస్తానని అన్నారు. మధ్యవర్తిత్వం ఆమోదయోగ్యమైతేనే తాను ఈ విషయంపై విచారణ చేపడతానని అన్నారు.

CJI ఎన్వీ రమణ సూచనకు ఏపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే సమాధానం ఇచ్చారు. ఈ ప్రతిపాదనను న్యాయమైన సూచనగా తాము చూస్తున్నామన్నారు. రాజకీయ ప్రాధాన్యత ఉన్న కేసు అయినందున ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి అభిప్రాయాన్ని తెలుసుకుంటానని అన్నారు. అటు, కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల వివాదంపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిందనందున ఏపీ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ అనవసరమని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్‌ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం కృష్ణా జలాలు అపరిమితంగా ఉన్నాయని అన్నారు.దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది.

ఈ ఏడాది అక్టోబర్ నుంచి గెజిట్ అమలులోకి వస్తుందని, ఈ మూడు నాలుగు నెలల పాటు తమకు అన్యాయం జరగకుండా ఉండేలా వెంటనే దాన్ని అమలులోకి తీసుకురావాలని దవే కోరారు. ఈ దశలో జోక్యం చేసుకున్న CJI ఎన్వీ రమణ నీటి ఎద్దడి వచ్చినప్పడే సమస్యలు వస్తాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఈశాన్య రాష్ట్రాలలో జరుగుతున్న ఘర్షణలను దుష్యంత్ దవే ప్రస్తావించారు. వెంటనే స్పందించిన CJI కలలో కూడా అలాంటి ఆలోచనలు రానీయవద్దని, తెలుగు వారంతా సోదరులని అన్నారు.

రెండు రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులు తమ తమ ప్రభుత్వాలను మధ్యవర్తిత్వానికి ఒప్పిస్తారని ఆశిస్తున్నానని చీఫ్ జస్టిస్ NV రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. అవాంఛితమైన మూడోపక్షం జోక్యానికి తావు ఇవ్వకండని హితవు పలికారు. మధ్యవర్తిత్వం గురించి ఆలోచించాలని CJI మరోసారి సూచించగా.. ప్రభుత్వంతో మాట్లాడి చెపుతామని న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. ఆయా ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించిన చీఫ్‌ జస్టిస్‌ రమణ.. విచారణను బుధవారానికి వాయిదా వేశారు. తెలుగు ప్రజలు ఒకరి అభివృద్దికి మరొకరు సహకరించుకోవాలే తప్ప కలలో కూడా కలహలు పెట్టుకోకూడదని CJI కోరారు.

కృష్ణా జలాల వివాదంలో ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ తమ జీవనాధారంపై దెబ్బ కొడుతోందనేది ఏపీ వాదన. టీసర్కార్‌ అక్రమంగా, ఏకపక్షంగా నీటిని విడుదల చేసి లక్షల క్యూసెక్కులు సముద్రం పాలు చేసేలా వ్యవహరించిందని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే న్యాయం కోసం సుప్రీం గడప తొక్కింది. దీనిపై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ చేసిన సూచనలు ఇప్పుడు కీలకంగా మారాయి. ప్రభుత్వాలు మధ్యవర్తిత్వానికి ఒప్పుకుని సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలనే CJI సూచన పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story