వాటే క్రియేటివిటి.. రూ.30లకే వాటర్ ఫిల్టర్..

నేటి యువతీ యువకులకు ఎన్నో అవకాశాలు. వారికున్న తెలివితేటలకు ఆధునిక పరిజ్ఞానము తోడై అద్భుతాలు సృష్టిస్తున్నారు. వినూత్న ఆలోచనలకు రూపకల్పన చేస్తున్నారు. టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కుతున్నారు. అతి తక్కువ వ్యయంతో 22 ఏళ్ల ఇంజనీరింగ్ యువకుడు పోర్టబుల్ వాటర్ ఫిల్టర్‌ను తయారు చేసి పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. బాటిల్‌లో పోసిన నీరు ఈ పరికరం ద్వారా క్షణాల్లో పరిశుభ్రంగా మారిపోతుంది. ‘ప్యూరిట్ ఇన్ పాకెట్’ పేరుతో తీసుకు వచ్చిన ఈ సాధనం ధర కూడా అందరికీ అందుబాటులో ఉంది. కేవలం 30 రూపాయలతో స్వచ్ఛమైన తాగునీటిని అందించే ఈ పరికరాన్ని త్వరలోనే పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాడు.

కర్నాటకకు చెందిన నిరంజన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఓ రోజు బెల్గాంలోని ఓ ప్రభుత్వ పాఠశాల పక్కన ఉన్న స్టేడియంకి వెళ్లాడు ఆడడానికి. అక్కడ ఆటలాడే విద్యార్థులు అపరిశుభ్రమైన నీటిని తాగడం చూసి కలత చెందాడు. అదే ఆలోచనతో ఇంటికి వెళ్లాడు. ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. మరుసటి రోజు మార్కెట్‌కి వెళ్లి ఫిల్టర్ రేట్లను పరిశీలించాడు. రేట్లు సామాన్య జనానికి అందుబాటులో లేవని బాధపడ్డాడు. పరిష్కారం కోసం జరిపిన అన్వేషణలో ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. అందుకోసం నిరంతరం శ్రమించాడు. అతడి శ్రమకు తగ్గ ఫలితం లభించింది. మొదటి ప్రయత్నంలోనే 100 లీటర్ల నీటిని శుభ్రం చేసే చిన్న వడపోత యంత్రాన్ని రూపొందించాడు.

తన కల సాకారమవ్వడంతో ఎంతో ఆశగా ఆ ప్రాజెక్ట్‌ని తన ప్రొఫెసర్లకు చూపించాడు. కానీ అది చాలా చిన్న ప్రాజెక్ట్ కావడంతో వారు దానిపై ఆసక్తి చూపించలేదు. అయినా నిరాశ చెందకపోగా.. మరింత పట్టుదలగా ముందుకు తీసుకువెళ్లాలనుకున్నాడు. ఓ మంచి పనికి ప్రశంసలు ఆలస్యంగానే దక్కుతాయని తనకు తానే సంభాళించుకుని ధైర్యంగా ముందడుగు వేశాడు. తాను రూపొందించిన ఫిల్టర్‌ను పేదలకు అందుబాటు ధరలో అందించాలనే దిశగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. కానీ దానికీ చిన్న మొత్తంలో అయినా పెట్టుబడి పెట్టే వారు కావాలి. అందుకు ఎవరిని అడగాలి అని ఆలోచించాడు. ఇంతలో దేశ్‌పాండే ఫౌండేషన్ వారు ముందుకొచ్చారు మేము చేయూతనందిస్తామంటూ.

అలా వారి సహకారంతో 2017లో రూ.12,000 పెట్టుబడితో ఈ ట్యాప్ లాంటి ఫిల్టర్లను తయారు చేయడం ప్రారంభించాడు. సోషల్ మీడియా ద్వారానే తన పరికరానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చిందని నిరంజన్ సంతోషంగా చెబుతున్నాడు. అసలు దీని ధర 20రూపాయలే. కానీ జీఎస్‌టీ వచ్చిన తరువాత దాన్ని రూ.30లకు పెంచాల్సి వచ్చిందని అంటున్నాడు. ప్రస్తుతం 2000 లీటర్ల నీటిని శుభ్రపరచగల అధునాతన ఫిల్టర్‌ను అభివృద్ధి చేస్తున్నానని.. దీనికి రూ.100 నుంచి రూ.150లు ఖర్చవుతుందని నిరంజన్ తెలిపాడు. మార్కెట్లో లభించే ఖరీదైన ఫిల్టర్లతో పోలిస్తే తాను రూపొందించిన ఫిల్టర్ ‘నిర్‌నల్’ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తుందని, 95 శాతం బ్యాక్టీరియాను నిర్మూలిస్తుందని హామీ ఇస్తున్నాడు.. ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు నిరంజన్.

Also watch

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *