ఘాటెక్కిన ఉల్లి ధర.. కిలో రూ.100

ఘాటెక్కిన ఉల్లి ధర.. కిలో రూ.100

ఉల్లి ధరలు ఘాటెక్కాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పంట దిగుమతులు పడిపోవడంతో ధరలు ఆకాశాన్నంటాయి. కొండెక్కిన ఉల్లి ధరలు సామాన్యులకు.. కొయ్యకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. ఓ వైపు పంట దెబ్బతిని రైతులు నష్టపోతే...మరోవైపు పెరిగిన ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తున్నాయి. ఉల్లి సరఫరా నిలిచిపోవడంతో తెలుగు రాష్ట్రాలు సహా పలు చోట్ల ధరలను పెంచారు. దీనికి ధళారుల దందా కూడా తోడు కావడంతో... చాలా చోట్ల కిలో ఉల్లి ధర 100ను చేరుకుంది. ఒకటి రెండు రోజుల్లోనే అరవై రూపాయల వరకు పెరిగింది. లాక్‌డౌన్ దెబ్బకు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి జేబులు ఖాళీ ఐన ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసరమైన ఉల్లి ధరలు పెరగడం.. ప్రజలను ఠారెత్తిస్తోంది.

హైదరాబాద్‌కు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుండి ఉల్లిపాయలు సరఫరా అవుతాయి. భారీ వర్షాలకు ఉల్లి పంట దెబ్బతినడంతో.. నగరంలోని ప్రధాన మార్కెట్లకు ఉల్లిపాయల సరఫరా గత నెల నుండి దాదాపు సగానికి తగ్గింది. మలక్‌పేట మార్కెట్‌కు ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీంతో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. కిలో 90 నుంచి 100వరకు పలుకుతోంది. ఇప్పటికే వరదలతో అతలాకుతలం అవుతున్న నగర వాసులు.. ఇప్పుడు ఉల్లి ధరల పోటుతో లబోదిబోమంటున్నారు.

ప్రతి ఏటా ఈ సీజన్లో 12 వేల క్వింటాళ్ల ఉల్లి కర్నూలు మార్కెట్లకు వచ్చేదని.. ఇప్పుడు 15 వందల నుంచి 2 వేల క్వింటాళ్లు మాత్రమే వస్తోందన్నారు. మరోవైపు మహారాష్ట్ర నుంచి అత్యధికంగా ఉల్లి దిగుమతులు జరిగేవని.. కానీ భారీ వర్షాల కారణంగా దిగుబడి తగ్గిపోయిందన్నారు. పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లిపాయల్ని రైతు బజార్ల ద్వారా కిలో 40 రూపాయలకే అందించేందుకు సిద్ధమైంది.5 వేల టన్నుల ఉల్లిని నాఫెడ్ ద్వారా దిగుమతి చేసుకునేందుకు ఇండెంట్ పంపించామన్నారు. తొలి దశలో అన్ని ప్రధాన పట్టణాల్లోని రైతు బ‌జార్ల ద్వారా కిలో 40 రూపాయలకు విక్రయించనున్నారు.

ఉల్లి ధరలు కొండెక్కికూర్చవడంతో... కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో ఉల్లి సరఫరాను పెంచేందుకు డిసెంబర్ 15వ తేదీ వరకు దిగుమతులపై ఉన్న నిబంధనలలో కొన్ని సడలింపులను చేసింది. ఉల్లి దిగుమతులను పెంచేలా ఇతర దేశాలల్లోని ట్రేడర్లతో భారత హైకమిషనర్ చర్చలు జరుపుతున్నారు. ఇరాన్, ఈజిప్ట్ తదితర దేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. సాధారణంగా నవంబరు చివరి వారంలో ఉల్లి కొరత తలెత్తుతుందని, ఈసారి మాత్రం అక్టోబరు లోనే ఊహించని పరిణామం చోటుచేసుకుందని ఉల్లి ట్రేడర్లు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story