ఆర్టికల్ 370 రద్దుపై స్పందించిన ప్రియాంక గాంధీ

ఆర్టికల్-370 రద్దుపై కాంగ్రెస్ విమర్శల జోరు పెంచింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ వాద్రా ఎట్టకేలకు స్పందించారు. ఆర్టికల్‌ 370 రద్దు జరిగిన తీరు రాజ్యాంగబద్ధంగా లేదని, ఈ విషయంలో ప్రజాస్వామ్య నియమాలన్నింటినీ కేంద్రం ఉల్లంఘించిందని ఆమె విమర్శించారు. భూతగాదాల కారణంగా జరిగిన కాల్పుల్లో 10మంది ఆదివాసీలు చనిపోయిన యూపీలోని సోన్‌భద్రలో ప్రియాంక పర్యటించారు. గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దుపై ఆమె స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తోందని, ఇదే తమ పార్టీ స్టాండ్ అని ఆమె స్పష్టంచేశారు.

అటు మోదీ సర్కార్ తీరుపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మండిపడ్డారు. ఆర్టికల్-370 రద్దు దేశ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయత అనే భావం కశ్మీర్ ప్రజల్లో బలంగా ప్రబలాలంటే వారి గళాన్ని సైతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశం చాలా సంక్షోభ పరిస్థితుల నుఎదుర్కొంటోందని, ఈ సమయంలో అందరూ ఏకతాటిపైకి వచ్చి గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు కశ్మీర్ పరిస్థితులపై గవర్నర్ సత్యపాల్ పాలిక్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మీకో విమానం పంపిస్తా, కశ్మీర్‌లో పర్యటించి మాట్లాడండి అంటూ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. విమానం అవసరం లేదు, ప్రజలను స్వేచ్ఛగా కలుసు కునే అవకాశం ఉంటే చాలంటూ సెటైర్ వేశారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *