తెల్లారితే మ్యాచ్.. ఆ రోజు రాత్రి నాన్న.. : విరాట్ కోహ్లీ వీడియో

కళ్ల ముందే తండ్రి మరణం ఓ పక్క.. కోరి ఎంచుకున్న కెరీర్ మరోపక్క. అయినా ఆ చిన్న గుండె ఎంతో ధైర్యంగా నాన్నకలను సాకారం చేయాలనుకుంది. గుండె దిటవు చేసుకుని, ఉబికి వస్తున్న కన్నీటిని మునిపంటిన అదిమి పెట్టి ఆటకు సిద్దమయ్యాడు.. భారత క్రికెట్ జట్టు సారథి అయ్యాడు. ఓ ఆటగాడికి ఉండవలసిన లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నాడు. మానసిక దృఢత్వంతో కెరిరీ‌లో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా నిబ్బరంగా ఉండడాన్ని అలవాటు చేసుకున్నాడు.

ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన కోహ్లీ.. ‘2006లో ఢిల్లీ తరపున రంజీ మ్యాచ్ ఆడుతున్న సమయంలో మా నాన్న చనిపోయారు. కర్ణాటకపై ఆరోజు 40 పరుగులు చేసి అజేయంగా క్రీజులో నిలిచాను. మరుసటి రోజు నేను ఎక్కువ సేపు బ్యాటింగ్ చేస్తే.. ఢిల్లీ జట్టు ఫాలో ఆన్ ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది. ఇదే ఆలోచనతో ఇంటికి వెళ్ళాను. అయితే అదే రోజు రాత్రి నాన్నకు విపరీతమైన గుండెనొప్పి వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన కన్నుమూశారు. కళ్ల ముందే నాన్న కన్నుమూయడంతో ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు.

ఇంట్లోని వారంతా శోకసంద్రంలో మునిగిపోతే నాకు మాత్రం ఏడుపు రాలేదు. నాన్న మాటలే నా చెవిలో మారు మ్రోగాయి. నన్ను క్రికెటర్‌గా చూడాలన్న నాన్న కోరికను నెరవేర్చాలి. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదని ఆరోజే బలంగా నిర్ణయించుకున్నాను. నాన్న కోరికను తీర్చాలి. అప్పుడే ఆయన ఆత్మకు శాంతి. ఉదయం నా కోచ్ రాజ్ కుమార్ సార్‌కి ఫోన్ చేసి.. నేను మ్యాచ్ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాను’ అని కోహ్లీ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *