శ్రీరాముడి వంశానికి వారసులం అంటూ..

అయోధ్య రామ జన్మభూమి వివాదం సుప్రీం కోర్టులో ఉంది. రఘువంశానికి చెందిన వారసులెవరైనా అయోధ్యలో నివసిస్తున్నారా అన్న కోర్టు ప్రశ్నకు భాజపా ఎంపీ, జైపూర్ రాజకుమారి దియా కుమారి తాము శ్రీరాముని కుమారులైన లవ కుశుల జంటలో కుశుడి వంశస్థులం అని చెప్పుకొచ్చారు. తమ కుటుంబం వద్ద ఉన్న పురాతన రాత ప్రతులు, వంశవృక్షం వివరాల ఆధారంగానే చెప్పగలుగుతున్నానని ఆమె అంటున్నారు. మేమే కాదు ప్రపంచ వ్యాప్తంగా శ్రీరాముని వంశస్థులు ఉన్నారని దియా అన్నారు. శుక్రవారం నాటి విచారణలో జస్టిస్ ఎస్ ఎ బొబ్డే, డివై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ ఎ నజీర్ బెంచ్ అయోధ్యలో రఘువంశానికి చెందిన వారసులెవరో తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో దియాకుమారి స్పందించారు.

శ్రీరాముడి వారసులం అయినందుకు గర్వపడుతున్నామే కాని, ఏదో ఆశించి ఇలా చెప్పట్లేదని ఆమె అన్నారు. రామజన్మ భూమి మీద మాకు హక్కు ఉందని వాదించదల్చుకోలేదు. ఈ లీగల్ వ్యవహారాల్లో భాగం కూడా కాదల్చుకోలేదు. శ్రీరాముడి వారసులం అని చెప్పుకోవడంలో ఎలాంటి దురుద్దేశాలు మాకు లేవు. మనసులో ఉన్న మాట మాత్రమే మీకు చెప్పదలిచాం అని ఆమె అన్నారు. కాగా, లవుడి కుటుంబానికి చెందిన వారమంటూ మేవర్-ఉదయ్‌పూర్ రాజకుటుంబానికి చెందిన మహేంద్రసింగ్ ప్రకటించారు. లవుడి పూర్వీకులు ముందు గుజరాత్‌లో ఉండేవారని.. ఆ తరువాత అక్కడి నుంచి అహద్ (మేవర్)కు వచ్చారని అన్నారు. అక్కడ వారు శిసోడియా వంశాన్ని ఏర్పాటు చేశారిని అన్నారు. తొలుత వారి రాజధాని చిత్తోర్ అయితే కాలక్రమంలో దాన్ని ఉదయ్‌పూర్‌కు మార్చారని తెలిపారు. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా కోర్టుకి సమర్పిస్తామన్నారు మహేంద్ర సింగ్.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *