నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

తెలంగాణలోని యువతీయువకులు తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు పొందేందుకు ప్రభుత్వం ఓ చక్కని ప్లాట్‌ఫామ్.. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ-DEET యాప్‌ని ప్రవేశపెట్టింది. దేశంలో ఇలాంటి ప్లాట్‌ఫామ్ మొదటిసారిగా రూపొందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. నిరుద్యోగులకు డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజిని అందుబాటులోకి తీసుకువచ్చింది. కార్మిక ఉపాధి కల్పన శాఖ ఓ ప్రైవేట్ సంస్థ సహకారంతో DEET యాప్‌, వెబ్‌సైట్ రూపొందించింది. ఈ యాప్‌లో మీ పేరు, విద్యార్హతల వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. మీ అర్హతలకు తగిన ఉద్యోగాలు వుంటే వెంటనే తెలిసిపోతుంది.

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఆల్గరిథమ్స్ ద్వారా మీ అర్హతలకు తగిన ఉద్యోగాలను డీట్ యాప్ సూచిస్తుంది. నిరుద్యోగులు మాత్రమే కాదు, ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ సేవలన్నీ ఉచితంగానే అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కంపెనీలు కూడ ఈ ప్లాట్‌ఫామ్‌లో జాబ్ నోటిఫికేషన్లను ఉచితంగానే నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వం రూపొందించి నిర్వహిస్తున్న యాప్ కాబట్టి ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలకు ఆస్కారం ఉండదు. ప్రైవేట్ సంస్థలు ఏవైనా ఉద్యోగుల కోసం వివరాలు అప్‌లోడ్ చేస్తే ఆ నోటిఫికేష్లు యాప్‌లో కనిపించవు.

యాప్ నిర్వాహకులు ఆ నోటిఫికేషన్ నిజమైనదేనా.. సదరు కంపెనీ నిజంగానే ఉద్యోగాలను ఇస్తోందా.. అసలు కంపెనీ ఏంటీ దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనే విషయాన్నింటినీ పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తరువాతే యాప్‌లో జాబ్ నోటిఫికేషన్స్ అప్‌లోడ్ అవుతాయి. డీట్ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం ఇప్పటికే జీఎంఆర్, అపొలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, స్విగ్గి లాంటి సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఇప్పటికే డీట్ ప్లాట్‌ఫామ్‌లో 45,000 ఉద్యోగాలకు ప్రకటనలు ఉన్నాయి. మరిన్ని వివరాలను https://tsdeet.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story