పాతది మార్చి కొత్తది కొనాలనుకుంటే మాత్రం..

పాతది మార్చి కొత్తది కొనాలనుకుంటే మాత్రం..

వాడుతున్న కారు లేదా బండి కొని ఎంతో కాలం కాలేదు. ఎందుకో కొత్త కారు మీద మనసు పోతోంది. తమ దగ్గర ఉన్న వాహనం కంటే ఫీచర్లు ఎక్కువ, పెట్రోల్ కన్జంప్షన్ తక్కువ.. రోడ్డు మీద రయ్‌ మంటూ దూసుకుపోతుంటే మనసు మాట విననంటోంది. మార్కెట్లోకి వచ్చిన కొత్త వెహికల్ కోసం షోరూం వైపుకి అడుగులు పడుతుంటాయి. ఎక్సేంజ్‌లో మంచి ధర వస్తుందని డీలర్ అంటే.. దాని కంటే కొంచెం ఎక్కువే ఇస్తాను బాస్ అని తెలిసిన వారు ఊరిస్తుంటారు. ఏం చేయాలో తెలియక, ఎలా చేస్తే మంచిదో అర్థం కాదు ఒక్కోసారి వాహనదారుడికి. తెలిసిన వారు తీసుకుంటే పర్లేదు.. అదే బ్రోకర్ల ద్వారా వెళ్లామనుకుంటే మాత్రం కొంచెం కష్టమే. వాహనం అవసరం ఉన్న వాళ్లు దొరకాలి.. వాళ్లకు మీ వాహనం నచ్చాలి. దీనంతటికీ కొంత సమయం పడుతుంది.

కొన్న షోరూంలోనే ఇవ్వాలనుకుంటే మాత్రం అదే బెస్ట్ అవుతుంది. మీ వాహనంపై ఉన్న పాత అప్పు తీరిపోతుంది. కొత్త వాహనానికయ్యే రుణాన్ని డీలరే చూసుకుంటారు. ఇంకా మీ పేరు మీద ఉన్న వాహనాన్ని కొనుగోలు దారుడి పేరు మీదకు మార్చడం కూడా సులువవుతుంది. రుణానికి సంబంధించిన పనంతా డీలరే చూసుకుంటారు. బ్రోకర్ల ద్వారా వాహనం అమ్మాలనుకుంటే పేరు మార్పు అనే ప్రక్రియ త్వరగా పూర్తి కాదు. ఈలోపు బండికి ఏదైనా డ్యామేజీ జరిగితే మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది.

ఎక్సేంజ్ చేస్తున్నప్పుడు డీలర్ చెప్పిన ధరకే ఒప్పుకోవాలి. మనం సొంతంగా అమ్ముకుంటే కాస్త ఎక్కువ రేటు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ రేటు వచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. అసలు మీరు వాహనం అమ్మాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ పరిస్థితులను అంచనా వేయాలి. ఇప్పుడంతా నెట్ ప్రపంచం. ఇందులో బోలెడంత సమాచారం. మీ వెహికల్ ఎప్పుడు కొన్నారు. దాని ఫీచర్లేంటి అన్ని వివరాలు నమోదు చేసి చూసుకుంటే ఎంతకు అమ్మొచ్చో ఓ నిర్ణయానికి రావచ్చు. డీలరైతే మీ వాహనాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేయాలని చూస్తారు.

వాహనానికి చిన్న చిన్న రిపేర్లు ఏమైనా ఉంటే చేయించుకుని షో రూంలో సర్వీసింగ్‌కి ఇస్తే కొత్త బండిలా మెరిసిపోతుంది. దాంతో రేటూ ఎక్కువ వస్తుంది.

పండుగ సమయాల్లో ఎక్సేంజ్ ఆఫర్లు ఎక్కువగా నడుస్తుంటాయి. వీటిలో ఎక్కువగా అమ్ముడవని కొత్త మోడళ్లపైనే రాయితీలు ప్రకటిస్తారు. అత్యధికంగా అమ్ముడయ్యే వాహనాలతో ఎక్సేంజ్ చేసుకుంటే పాతవైనా ధర ఎక్కువగానే కోట్ చేస్తారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఎలా చేస్తే బావుంటుందనేది ఫైనల్ డెసిషన్ మీదే కావాలనేది గుర్తుపెట్టుకోండి. పక్కవాళ్ల మాటలకు తలొగ్గకండి.

Also Watch :

Tags

Read MoreRead Less
Next Story