ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తూ.. 'మల్లేశం'కి అర్థాంగిగా..

ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తూ.. మల్లేశంకి అర్థాంగిగా..

ఇష్టంగా చదువుకుంది.. మంచి ఉద్యోగం కూడా చేస్తోంది. అయినా ఏదో వెలితి. ఇది కాదేమో నా గోల్. ఏదో చేయాలి. నటన అంటే ఇష్టం. మనసులోని కోరిక దేవుడికి తెలిసిందేమో.. ఓ అవకాశం ఇచ్చాడు దర్శకుడు రాజ్ రూపంలో. తనను తాను నిరూపించుకుంది. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది అనన్య. 'మల్లేశం'కి అర్థాంగిగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య మూడేళ్ల వయసులోనే నాన్నను పోగొట్టుకుంది. అమ్మే అన్నీ తానై అన్నని, తనని పెంచి పెద్ద చేసింది. పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన అనన్య కుటుంబం సంప్రదాయాలకు పెద్ద పీట వేసేది. బీటెక్ చదివిన అనన్య.. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తూనే లా కూడా పూర్తి చేసింది. సాప్ట్‌వేర్ ఉద్యోగం.. మంచి జీతం.. అయినా ఆమెకు నచ్చలేదు. ఉద్యోగం చేస్తూనే యాక్టింగ్‌ స్కూల్లో జాయినై నటనకు సంబంధించిన మెళకువలు నేర్చుకుంటోంది. ఆ సమయంలోనే వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం వచ్చింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. అయినా పట్టుబట్టి ఒప్పించింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లోనే నటిస్తానని అమ్మకి మాటిచ్చింది. అయితే సినిమాల్లో అవకాశం అంత ఈజీగా రాలేదు. పల్లెటూరి అమ్మాయిగా పనికి రాదన్నారు. పద్మ పాత్రకు సరిపోదన్నారు. అయినా పట్టుబట్టి పాత్రలో నటించి ప్రేక్షుకుల్ని మెప్పించింది. సక్సెస్ అయితే యాక్టింగ్‌లో కొనసాగాలని లేదంటే లా ప్రాక్టీస్ చేయాలనుకుంది.

అనుకోకుండా షార్ట్ ఫిల్మ్‌లో చిన్న రోల్ చేసే అవకాశం వచ్చింది. దాని తరువాత వరుస అవకాశాలు. 'షాదీ' షార్ట్ ఫిల్మ్ పేరు తీసుకువచ్చింది. అందులోని నటనకు గాను సైమా బెస్ట్ యాక్ట్రెస్‌గా నామినేషన్ వచ్చింది. అప్పటి నుంచి సీరియస్‌గా యాక్టింగ్ మీద ద‌ృష్టి పెట్టి.. నటనలో మరింత మెరుగులు పరుచుకునే ఉద్దేశంతో యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్ అనే ఇనిస్టిట్యూట్‌లో జాయినయ్యింది. అక్కడే మల్లేశం దర్శకుడు రాజ్ రాచకొండ సినిమాకు సంబంధించిన డిస్కషన్ అంతా చేసేవారు. ఆ కథ విన్న అనన్యకి ఎందుకో మల్లేశం భార్య పాత్ర ఎవరు చేస్తారో కానీ అదృష్ట వంతురాలు అని అనుకుంది. ఆ పాత్ర తననే వరిస్తుందని ఊహించలేకపోయింది.

ఆడిషన్స్‌లో దర్శకుడ్ని మెప్పించలేకపోయింది. తన తప్పుల్ని సవరించుకుని మరింత కష్టపడి ఈసారి ఓకే చేయించుకుంది. ఉద్యోగానికి నెల రోజులు సెలవు పెట్టి.. చీరకట్టు కోవడం, తెలంగాణ యాసలో మాట్లాడడం నేర్చుకుంది. సినిమా షూటింగు ప్రారంభానికి ముందే స్క్రిప్ట్ అంతా 30 , 40 సార్లు చదివేసరికి తన డైలాగులతో పాటు సినిమాలోని నటీనటులందరి డైలాగులు నేర్చేసుకుంది. షూటింగుకి నాలుగైదు రోజుల ముందే సినిమా తీసే ఊరికి వెళ్లి అక్కడి మనుషుల మధ్య ఉంటూ, వారితో మాట్లాడుతూ భాషపై మరింత పట్టు సాధించింది. చిత్రంలో నటించిన మల్లేశం తండ్రి పాత్ర ధారి సినిమా రషెస్ చూసి చాలా బాగా చేశావు.. ఈ పాత్ర కోసం నువు చేసిన కష్టమంతా కనిపిస్తుంది. షబనా అజ్మీ స్థాయికి వెళతావమ్మా అని అన్నారు. అయితే అవకాశాల కోసం పరుగులు పెట్టను. పాత్ర నచ్చితేనే చేస్తాను అని అంటోంది అనన్య.

Tags

Read MoreRead Less
Next Story