ఎవరో తెలియదు.. అడిగితే కాదన్లేదు.. వీడియో

ఎవరో తెలియదు.. అడిగితే కాదన్లేదు.. వీడియో

మనుషుల్లో మానవత్వం ఉంది. అందుకే మనలాంటి వారు ఇంకా బతగ్గలుగుతున్నారు. ఒకరికొకరి సాయం వంద ఏనుగుల బలం. అంతకు ముందెన్నడూ చూడలేదు. అయినా అడిగితే వస్తాడో రాడో తెలియదు. ధైర్యం చేసి విషయం చెప్పాడు. మరో ఆలోచన లేకుండా ఆటోని రైల్వే ప్లాట్ ఫాం పైకి తీసుకొచ్చాడు. ఓ గర్భిణీకి ప్రాణం పోశాడు. ముంబయిలోని విరార్ రైల్వేస్టేషన్‌లో ఆగస్ట్ 4న ఓ వ్యక్తి గర్భిణీతో ఉన్న భార్యను తీసుకుని లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా ట్రైన్ స్టేషన్‌లో ఆగింది. ఈ క్రమంలో ఆమెకు అకస్మాత్తుగా నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాని భర్త భయంతో స్టేషన్ బయటకు వచ్చాడు. ఏదైనా ఆటో దొరుకుతుందేమో అని చూశాడు.

ఇంతలో అక్కడికి సాగర్ కమలాకర్ గవాడ్ అనే ఆటో డ్రైవర్ వచ్చాడు. అతడికి భార్య పరిస్థితి వివరించాడు. బయట జోరున వర్షం. అతడిలో ఆందోళన. డ్రైవర్ మారు మాట్లాడకుండా ఆటోని తీసుకుని ప్లాట్‌ఫాం పైకి వచ్చేశాడు. వెంటనే గర్భిణిని, ఆమె భర్తని ఆటోలో ఎక్కించుకుని సమీపంలోని ఆసుపత్రికి తీస్కెళ్లి ఆమె ప్రాణాలు కాపాడాడు. అయితే నిబంధనలకు విరుద్దంగా ఆటోను ప్లాట్‌పాం పైకి తీసుకు వచ్చాడని రైల్వే పోలీసులు గవాడ్‌ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి పూర్వాపరాలు విచారించారు. గర్భిణిని రక్షించడం కోసం అతడు అలా చేయవలసి వచ్చిందని తెలుసుకుని బెయిల్‌పై విడుదల చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గవాడ్ చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story