శుభకార్యానికి వెళ్లి వస్తూ.. వరదనీటిలో గల్లంతైన కుటుంబం

శుభకార్యానికి వెళ్లి వస్తూ.. వరదనీటిలో గల్లంతైన కుటుంబం

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరు దగ్గర వాగులో ఆరుగురు గల్లంతయ్యారు. కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో కడప జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే, ఓ కుటుంబం బంధువుల ఇంటికెళ్లి ఆటోలో తిరిగొస్తుండగా, వాగు పొంగిపొర్లడంతో, ఆటో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు వాగులో కొట్టుకుపోయారు. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

పోట్లదుర్తి గ్రామం ఎస్సీకాలనీ వాసులు ప్రొద్దుటూరు రూరల్‌ పోలీ‌సస్టేషన్‌కు వెళ్లి గల్లంతైన వారు తమ కాలనీకి చెందిన మునగాల రామాంజినేయులు కుటుంబసభ్యులని తెలిపారు. రామాంజనేయులు ఆటో డ్రైవర్‌. ఇటీవలే ఆటో కొన్నాడు. దువ్వూరు మండలం గొల్లపల్లిలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి భార్య పెంచలమ్మ, తల్లి సుబ్బమ్మ, కుమార్తెలు మేఘన, అంజలితో పాటు ఆరు నెలల కుమారుడుతో ఆటోలో సోమవారం ఉదయం వెళ్లారు. ఆరోజు రాత్రి 11గంటల ప్రాంతంలో పోట్లదుర్తికి బయలుదేరారు. మార్గమధ్యంలో కామనూరు వంకపై నీటి ప్రవాహంలో చిక్కుకుని ఆ ఉధృతికి ఆటోతో సహా అందరూ గల్లంతయ్యారు.

బుధవారం ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు గాలింపుచర్యలు మొదలుపెట్టారు. మైలవరం నుంచి గజఈతగాళ్లను రప్పించి, ఫైర్‌ సిబ్బంది సాయంతో గాలింపు ముమ్మరం చేశారు. ముగ్గురు మృతదేహాలను గుర్తించారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయం తెలిసి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో వైపు కొన్ని రోజుల క్రితమే రామాంజనేయులు కొత్త ఆటోను కొనుగోలు చేసినట్టుగా బంధువులు చెబుతున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story