అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి..బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంటూ..

బ్రతకాలి.. ఎవరి మీదా ఆధారపడకుండా.. ఎవరి చీదరింపులకు గురికాకుండా.. తన కాళ్ల మీద తాను బ్రతుకుతూ తనలాంటి వారికి ఆదర్శం కావాలి. దేవుడు మగాడిగా పుట్టించినా ఆలోచనలు అమ్మాయిగానే. ఎదుగుతున్న క్రమంలో అవి మరింత ఎక్కువయ్యాయి. హోటల్‌లో పని కావాలని అడిగితే ఇచ్చారు. కానీ ట్రాన్స్ జెండర్ అని తెలిసి పనిలో నుంచి తీసేసారు. అయినా ఇంకేదైనా పని చేసుకుని బ్రతకాలి. అందుకోసం ఆటో నడపడం నేర్చుకుంది. ఆటోని బాడుగ తీసుకుని ముంబయి రోడ్ల మీద డ్రైవ్ చేస్తూ ప్రయాణీకులను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన మంజు. ఓ రోజు తన పొడవాటి గోళ్లకు పింక్ రంగు నెయిల్ పాలిష్ వేసుకుని ఆటో వీల్ తిప్పుతుంటే ఓ ప్రయాణీకురాలు చూసింది. ఏంటి అమ్మాయిలా ఆ నెయిల్ పాలిష్.. ఆ గోళ్లేంటి అని ఆశ్చర్యపోతూ అడిగింది. దానికి మంజూ తన స్టోరీ అంతా వివరించి.. రంజాన్ పండగ వచ్చింది కద అక్కా.. అందుకే పెట్టుకున్నా అంది మంజు. ఎక్కడా పని దొరక్కపోతే జీవనోపాధికోసం ఆటో నడుపుతున్నానని తెలిపింది. తాను తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంటున్నానని చెప్పింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ఆటో నడుపుతానని ఆ తరువాత ఇంటికి వెళ్లి పోతానని అంది. ఆకతాయిల వేధింపులను తిప్పికొడుతూ జీవనం సాగిస్తున్నామని చెప్పింది. ట్రాన్స్‌జెండర్ మంజు స్టోరీ తెలుసుకున్న పూనమ్ కళ్లు చెమర్చాయి. మంజూని ఆవిధంగా కలవడం తనకు సంతోషాన్ని కలిగించిందని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అది కాస్తా వైరల్‌గా మారి మంజు ఫేమస్ అయిపోయింది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *