మూడువందలు ఆపితే.. మూడువేలు సృష్టిస్తాం - జనసైనికులు

మూడువందలు ఆపితే.. మూడువేలు సృష్టిస్తాం - జనసైనికులు

పవన్ అభిమానులు, జనసేన పార్టీ మద్దతుదారులకు సంబంధించిన ఖాతాల్ని బ్లాక్ చేసింది ట్విట్టర్‌ సంస్థ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి, భారీ ఫాలోయింగ్ ఉన్న ట్రెండ్ PSPK, పవనిజం నెట్ వర్క్, వరల్డ్ PSPK ఫ్యాన్స్, దాస్ PSPK సహా పలుపేర్లతో ఉన్న దాదాపు 300 ట్విట్టర్ ఖాతాలు సస్సెండ్ అయ్యాయి. జనసేనకు మద్దతుగా పని చేసే శతఘ్ని టీంకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలు ఇవి.

జనసేన శ్రేణులు గత కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో సేవ్ నల్లమల క్యాంపెయిన్ చేస్తున్నాయి. అలాగే వైఎస్ జగన్ ఫెయిల్డ్ సీఎం అనే క్యాంపెయిన్‌ను కూడా మొదలుపెట్టాయి. సేవ్ నల్లమల క్యాంపెయిన్‌ కారణంగా ట్విట్టర్ తమ ఖాతాలను సస్పెండ్ చేసే అవకాశం లేదని.. కాబట్టి ఇది YSRCP పనే కావచ్చని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.

జనసేనకు ట్విట్టర్ షాక్ ఇవ్వడంతో పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జనసేన మద్దతుదారులకు సంబంధించి 300 అకౌంట్లను ట్విట్టర్ ఎందుకు సస్పెండ్ చేసిందో తనకు తెలియడం లేదని తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. నిస్సహాయులైన ప్రజల తరపున నిలబడినందుకే ఈ ఖాతాలను సస్పెండ్ చేశారా? అని ట్విట్టర్ యాజమాన్యాన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలన్నారు. వెంటనే బ్లాక్ చేసిన తమ సామాజిక మాధ్యమ ఖాతాలను పునరుద్ధరించాలని పవన్ కల్యాణ్ ట్విట్టర్‌ను డిమాండ్ చేశారు. పవన్‌ ట్వీట్‌ తో స్పందించిన సంస్థ.. విచారణ జరిపిస్తామని... ఏం జరిగిందో తెలుసుకుంటామన్నారు.

జగన్ తనకు నచ్చని న్యూస్ ఛానెళ్లను, ట్విట్టర్ ఖాతాలను నిషేధిస్తున్నారని.. మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారని.. కొందరు జనసైనికులు ఆరోపిస్తున్నారు. జనసేనను చూసి వైఎస్ఆర్సీపీ భయపడుతోందన్నారు. జనసేన సోషల్ మీడియా ఖాతాలను మళ్లీ పని చేసేలా చూద్దామని ఆన్‌ లైన్‌ లో క్యాంపెయిన్‌ మొదలుపెట్టారు. 3వందలు ఆపితే.. మూడువేలు సృష్టిస్తామంటున్నారు జనసైనికులు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story