వాట్సప్‌లో భర్త మెసేజ్.. అది చూసి భార్య షాక్

చట్టాలు ఎన్ని వస్తున్నా తప్పు చేసేవారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తలాక్ సమస్యను ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని చట్టంగా మార్చింది. ట్రిపుల్ తలాక్ ఆచారంతో భార్యలను వదిలించుకునే పద్దతికి ఫుల్ స్టాప్ పెట్టింది. కానీ అది చట్టంగా మారినా సంస్కృతిలో ఎలాంటి మార్పు రాలేదు. దానికి తాజాగా జరిగిన ఓ సంఘటనే ఉదాహరణ. కేరళకు చెందిన ఓ ఎన్నారై తన భార్యకు వాట్సప్‌లో మూడు సార్లు తలాక్ చెప్పి మరో వివాహం చేసుకున్నాడు.

యూఎఈలో ఉద్యోగం చేస్తున్న బీఎమ్ అష్రాఫ్‌కు 2007లో కేరళ రాష్ట్రాంలోని కసర్గోడ్‌కు చెందిన మహిళతో వివాహం జరిగింది. వివాహ సమయంలో కొంత డబ్బు, అభరణాలను ఆ మహిళ తల్లిదండ్రులు అష్రాఫ్‌కు ముట్టజెప్పారు. అయినప్పటికీ అతని ఆశ తీరలేదు. మరింత కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించాడు. దుబాయిలో ఉంటూ ఇండియాకు వచ్చిన సమయంలో సొమ్ముల కోసం ఆమెను హింసించేవాడు. దీంతో బాధితురాలు భర్తపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టింది. తర్వాత అష్రాఫ్‌ మారినట్టు నటించాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తన బుద్ధిని చూపించాడు. అదనపు కట్నం తీసుకురాకపోతే బంధాన్ని తెగతెంపులు చేసుకుందామంటూ బెదిరించాడు.

చివరకు అనుకున్నంత పనిచేశాడు. ఓరోజు ఆమెకు వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పెట్టాడు. అది ఏంటా అని చూసిన ఆమె ఒక్కసారిగా షాకైంది. అందులో తలాక్‌ని మూడు సార్లు చెప్పడం చూసి విస్తుపోయింది. మరుసటిరోజే మరో మహిళను వివాహమాడిన అష్రాఫ్ ఆమెతో కలిసి యూఏఈ వెళ్ళిపోయాడు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాధు చేసింది. ట్రిపుల్ తలాక్ నిరోధక చట్టం కింద అష్రాఫ్‌పై కేసు నమోదు చేశారు. దుబాయిలో ఉన్న అతన్ని తిరిగి భారత్‌కు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *