Jaipur-Mumbai train : రైల్లో కాల్పుల క‌ల‌క‌లం

Jaipur-Mumbai train :  రైల్లో కాల్పుల క‌ల‌క‌లం
ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్ర‌యాణికులు మృతి

జైపూర్ - ముంబై ఎక్స్‌ప్రెస్ రైల్లో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ఓ కానిస్టేబుల్ జ‌రిపిన కాల్పుల్లో న‌లుగురు మృతి చెందారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న సోమ‌వారం తెల్ల‌వారుజామున 5 గంట‌ల‌కు వాపి – మీరా రోడ్ స్టేష‌న్ మ‌ధ్య‌లో చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న రైల్వే పోలీసులు. కాల్పులు జ‌రిపిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అత‌న్ని నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల‌కు పాల్ప‌డిన కానిస్టేబుల్‌ను చేత‌న్‌గా గుర్తించారు. మృతుల్లో ఆర్పీఎఫ్ ఏఎస్ఐతో పాటు ముగ్గురు ప్ర‌యాణికులు ఉన్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


ఈ ఘటన చోటు చేసుకున్న ట్రైన్ నంబర్ 12956, జైపూర్ నుంచి ముంబై వెళుతున్న జైపూర్ ఎక్స్ ప్రెస్, పాల్ఘర్ స్టేషన్ దాటుతున్న క్రమంలో, ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. కానిస్టేబుల్ తన సహోద్యోగితో వాగ్వాదానికి దిగాడని, ఈ విషయంలో కొందరు జోక్యం చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో మండిపడ్డ కానిస్టేబుల్ మొత్తం అందరిపైనా కాల్పులు జరిపాడని సమాచారం. ఈ ఘటన బీ5 కోచ్ లో ఉదయం 5 గంటల సమయంలో ప్రయాణికులందరూ నిద్రిస్తున్న సమయంలో జరిగింది. ఈ కాల్పుల శబ్దంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. కానిస్టేబుల్ కొంతకాలంగా డిప్రెషన్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

నిందితుడిని చేతన్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. ఘటనకు పాల్పడిన అనంతరం చేతన్ దహిసర్ స్టేషన్ సమీపంలో రైలు నుంచి కిందకు దూకాడు. నిందితుడైన కానిస్టేబుల్ ను అతని ఆయుధంతో పాటు అదుపులోకి తీసుకున్నట్లు పశ్చిమ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సహా నలుగురు మృతి చెందినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ధృవీకరించింది. ఈ ఘటనపై నార్త్ జీఆర్పీ డీసీపీకి సమాచారం అందించినట్లు ఆర్పీఎఫ్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story