విద్యార్థుల కోసమే స్కూల్ కూల్చేశారు .. ఎక్కడంటే..

విద్యార్థుల కోసమే స్కూల్ కూల్చేశారు .. ఎక్కడంటే..
మృతి చెందిన వారి శవాలను ముందుగా ఈ పాఠశాలకే తరలించారు. తరువాత ఇక్కడి నుంచి భువనేశ్వర్ ఆసుపత్రికి పంపారు.

ఎదుటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసిన ఆ ఊరి వాళ్ళు ఆ క్షణంలో దేవుళ్ళని పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఆ గ్రామ వాసులే తమ ప్రాంతంలో దెయ్యాలున్నాయేమో అని భయపడిపోతున్నారు. స్కూల్ కి వెళ్ళటానికి పిల్లలే కాదు పంపటానికి పెద్దలు కూడా ససేమిరా అంటున్నారు. ఆ ప్రజల మానసిక స్థితిని అంచనా వేసిన ప్రభుత్వం స్కూల్ని పడగొట్టి మరోసారి కట్టించడానికి రంగం సిద్ధం చేసింది.

ఒరిస్సాలోని బహానగా రైల్వే స్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో 288 మంది దుర్మరణం పాలవ్వగా 1000 మంది గాయపడ్డారు. ఘటన జరిగి సుమారు వారం రోజులైనా ప్రమాద దృశ్యాలు ఇంకా అందరి కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. అతి క్లిష్టమైన ప్రమాద సమయంలో బహానగా వాసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులకు చేసిన సహాయం మరువలేనిది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను స్థానిక బహానగా ప్రభుత్వ పాఠశాలలో భద్రపరిచారు.

మరికొన్ని రోజుల్లో స్కూల్ తెరవనున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ స్కూలుకు వెళ్లేందుకు విద్యార్థులు భయపడుతున్నారు. ఘటనలో మృతి చెందిన వారి శవాలను ముందుగా ఈ పాఠశాలకే తరలించారు. తరువాత ఇక్కడి నుంచి భువనేశ్వర్ ఆసుపత్రికి పంపారు. తర్వాత పాఠశాలను శుభ్రం చేశారు. అయినప్పటికీ వందలాది మృతదేహాలను ఒకే చోట చూసిన పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రదేశం సమీపానికి వచ్చేందుకు జంకుతున్నారు. పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు ధైర్యం చేయట్లేదని, తల్లిదండ్రులు కూడా చిన్నారులు స్కూలుకు పంపేందుకు నిరాకరిస్తున్నారని పాఠశాల ఉపాధ్యాయులు చెప్తున్నారు. దీంతో పాఠశాలను కూల్చివేయాలని స్కూల్ యాజమాన్యం ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ఈ నేపథ్యంలోనే స్కూలును పరిశీలించిన అధికారులు ఇది 65 సంవత్సరాల క్రితం నిర్మించిన భవనం కాబట్టి ఇప్పటికే దెబ్బతిని ఉందని, దానికి తోడు తాజా పరిస్థితుల నేపథ్యంలో కూల్చివేయడమే సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్ కూడా స్కూలును పరిశీలించి కూల్చివేతకు అనుమతులు మంజూరు చేశారు. దీంతో పాఠశాల భవనాన్ని శుక్రవారం కూల్చివేశారు. ఈ ప్రదేశంలో మరో కొత్త భవనాన్ని నిర్మిస్తామని అప్పుడు విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా వస్తారని స్కూల్ యాజమాన్యం భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story