CHANDRAYAN 3: మరోసారి విక్రమ్‌ సేఫ్‌ ల్యాండ్‌

CHANDRAYAN 3: మరోసారి విక్రమ్‌ సేఫ్‌ ల్యాండ్‌
మరోసారి సాఫ్ట్‌ ల్యాండింగ్ చేసినట్లు వెల్లడించిన ఇస్రో... మానవ యాత్రలకు ఈ కిక్‌ స్టార్ట్‌ ఉత్సాహపరుస్తుందని ట్వీట్‌....

విక్రమ్‌ ల్యాండర్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో జాబిల్లిపై మరోసారి సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసింది. ఇప్పటికే చంద్రయాన్‌-3 మిషన్‌లోని నిర్దేశించుకున్న లక్ష్యాలకు మించి విక్రమ్‌ ల్యాండర్‌ పనితీరు కనబర్చినట్లు ఇస్రో వెల్లడించింది. తాజాగా విక్రమ్‌ ల్యాండర్‌లో హాప్‌ ప్రయోగాన్ని నిర్వర్తించింది. ఇస్రో ఇచ్చిన ఆదేశానికి అనుగుణంగా ల్యాండర్‌ తన ఇంజిన్లు మండించింది. అనుకున్న విధంగా చంద్రుని ఉపరితలం నుంచి 40 సెంటీమీటర్ల పైకి లేచింది. అనంతరం 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఆ దృశ్యాలను ఇస్రో సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పంచుకుంది.

భవిష్యత్తులో చంద్రునిపై శాంపిళ్లను తిరిగి తెచ్చే మిషన్లకు, మానవ యాత్రలకు ఈ కిక్‌ స్టార్ట్‌ ఉత్సాహపరుస్తుందని ఇస్రో పేర్కొంది. అన్ని వ్యవస్థలూ ఆరోగ్య వంతంగా ఉన్నట్లు తెలిపింది. ర్యాంప్‌, చాస్టే, ILSA పేలోడ్లను మడిచి ప్రయోగం తర్వాత విజయవంతంగా అమర్చినట్లు ఇస్రో పేర్కొంది.


ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువానికి సమీపంలో విక్రమ్‌ ల్యాండర్‌ను సురక్షితంగా దింపి చరిత్ర సృష్టించిన భారత్‌ ఇప్పటికే నిర్దేశించుకున్న లక్ష్యాలను అన్నింటినీ చేరుకుంది. ఈ వ్యోమనౌకలు దిగిన ‘శివ్‌శక్తి పాయింట్‌’ వద్ద క్రమంగా చీకట్లు ఆవరించనున్నాయి. 14 రోజుల రాత్రి సమయం అక్కడ ప్రారంభం కానుంది. జాబిల్లిపై రాత్రివేళ నెలకొనే ప్రతికూల పరిస్థితులను విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లు తట్టుకోలేవు. ఏకబిగిన 14 రోజుల పాటు సూర్యకాంతి అందుబాటులో లేకపోవడమే ప్రధాన సమస్య. ఆ సమయంలో బ్యాటరీల రీఛార్జి అసాధ్యం. జాబిల్లిపై రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు దాదాపు మైనస్‌ 200 డిగ్రీలకు పడిపోతాయి. ఇంత అసాధారణ శీతల వాతావరణాన్ని ల్యాండర్‌, రోవర్‌లోని సున్నితమైన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు తట్టుకోలేకపోవచ్చు. అందువల్ల ఈ రెండు వ్యోమనౌకలను నిద్రాణ స్థితిలో ఉంచుతున్నారు. ఇప్పటికే రోవర్‌ను నిద్రాణ స్థితిలోకి పంపినట్లు ఇస్రో తెలిపింది.

జాబిల్లిపై రాత్రి అంటే భూమిపై 14 రోజుల పూర్తయి, సూర్యోదయమయ్యాక మళ్లీ ల్యాండర్‌, రోవర్‌ క్రియాశీలమయ్యే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం విశ్రాంతి దశలోకి వెళ్లిన రోవర్‌లోని బ్యాటరీలు పూర్తిగా రీఛార్జి అయ్యాయని ఇస్రో తెలిపింది. మళ్లీ ఈ నెల 22న శివ్‌శక్తి పాయింట్‌ వద్ద సూర్యోదయమవుతుందని పేర్కొంది. ఆ రోజున సూర్యకాంతిని అందుకునేలా రోవర్‌ సౌరఫలకం దృక్కోణాన్ని మార్చినట్లు వెల్లడించింది. దాని రిసీవర్‌ను ఆన్‌ చేసి పెట్టినట్లు పేర్కొంది. ఒకవేళ అది క్రియాశీలం కాకుంటే చంద్రమండలంపై భారత రాయబారిగా ఎప్పటికీ ఉండిపోతుందని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story