Manohar joshi: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి కన్నుమూత

Manohar joshi:  మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి కన్నుమూత
మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో లోక్‌సభ స్పీకర్‌గానూ సేవలు

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ జోషి కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబయిలోని.. పి.డి.హిందుజా ఆసుపత్రిలో చేరిన 86 ఏళ్ల జోషీ.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇవాళ మధ్యాహ్నం ముంబయిలో అంత్యక్రియలు జరగనున్నాయి. శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన మనోహర్‌ జోషి 1995 నుంచి 1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002-2004 మధ్య లోక్‌సభ స్పీకర్‌గానూ వ్యవహరించారు.


1937 డిసెంబర్‌ 2న నాంద్వీలో జోషీ జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం ముంబయిలో సాగింది. సతీమణి అనఘ మనోహర్‌ జోషీ 2020లో మరణించారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తొలినాళ్లలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన మనోహర్‌ జోషి 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1967 నుంచి 77 వరకు ముంబయి మేయర్‌గా పనిచేశారు. మూడు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత 1990లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1990-91 మధ్య అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన తరఫున ముంబయి నార్త్‌-సెంట్రల్‌ నియోజవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు.మనోహర్‌ జోషి శివసేన పార్టీలో అగ్రస్థాయి నేతగా ఎదిగారు. అంచెలంచెలుగా ఎదిగి 1995 నుంచి 1999 మధ్యకాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఇక మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో 2002-2004 కాలంలో లోక్‌సభ స్పీకర్‌గానూ పనిచేశారు. జోషి మృతిపట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది మే నుంచి జోషి ఆరోగ్యం ప్రమాదకరంగా ఉంది. ఆయన మెదడులో రక్తస్రావం కావడంతో హిందూజా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అనంతరం మెల్లగా కోలుకోవడంతో ఆయనను కుటుంబసభ్యులు ఇంటికి తరలించారు. అప్పటి నుంచి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. గతేడాది డిసెంబరు 2న ఆయన పుట్టినరోజు సందర్భంగా దాదర్‌లోని తన ఆఫీస్‌కు వచ్చారు. ఆయన మద్దతుదారుల సమక్షంలో వేడుకలను జరుపుకున్నారు.తరువాత మళ్ళీ ప్రజాలలోకి రాలేదు. కాగా శుక్రవారం (ఈ రోజు) మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు ముంబైలో జరగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story