HALEEM: నోరూరిస్తున్న హలీమ్‌

HALEEM: నోరూరిస్తున్న హలీమ్‌
ఏటా దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బిజినెస్‌... వేరే దేశాలకు ఎగుమతి

హలీమ్.... ఈ పేరు వినగానే అందరి నోళ్లలో నీళ్లూరుతాయంటే అతిశయోక్తి కాదు. ఈ వంటకం ప్రత్యేకతే వేరు మరి. కట్టెల పొయ్యి మీద స్వచ్ఛమైన నెయ్యితో చికెన్, మటన్ ను బాగా ఉడకబెట్టి చేసే వంటకం ఇది. రంజాన్‌ మాసంలో ఉపవాసాలు ఉండే ముస్లింలు సాయంత్రం వేళల్లో ప్రార్థనల అనంతరం దీనిని ఆరగిస్తుంటారు. దీనిలో రుచి మాత్రమే కాదు...ప్రోటీన్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ముస్లింలు రోజంతా ఉపవాసం ఉండటానికి కావాలసిన ప్రోటీన్ దొరుకుతుందని దీనిని ఆరగిస్తుంటారు. అందుకే హైదరాబాదీ హలీమ్ కు జీఐ గుర్తింపు వచ్చి ప్రత్యేక బ్రాండ్‌గా కొనసాగుతోంది. హైదరాబాద్ లో హలీం తయారీలో పేరుగాంచిన పిస్తా హౌజ్‌ రోజుకు 10వేల కిలోల హలీంను విక్రయిస్తోందని ఆ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.


రంజాన్‌ అనగానే మనందరి మదిలో మెదిలే పేరు హలీమ్‌. ఈ వంటకం గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా హైదరాబాద్‌ హలీంకు దేశవ్యాప్తంగా పేరు ఉంది. దీనిని అరబిక్‌ వంటకం అని కూడా అంటారు. సాధారణంగా హలీం రంజాన్‌ మాసంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రతి ఏటా దాదాపు వెయ్యి కోట్లకు పైగా హలీమ్‌ వ్యాపారం జరుగుతుందంటే.. ఈ మొఘలాయ్‌ వంటకానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.

దక్షిణ భారత దేశంలో మాంసం అధికంగా లభిస్తుంది. దీని వల్ల హలీమ్‌కు కావాల్సిన ముడి సామాగ్రి అంతా.. ఇక్కడే లభిస్తుండటంతో ఎక్కువ శాతం ఇక్కడి నుంచే వేరే దేశాలకు హలీంను ఎగుమతి చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పిస్తా హౌస్‌, రాయదుర్గంలోని ఓల్డ్‌ సిటీ రెస్టారెంట్‌, ప్యారడైజ్‌ రెస్టారెంట్లు ఈ నెలలో వేరే దేశాలకు హలీంను ఎగుమతి చేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు రవాణా ఆలస్యం కావడంతో... దాని రుచి మారడం, పాడవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలా కాకుండా నేరుగా వంట వాళ్లనే అక్కడికి పంపి అక్కడే అవుట్ లెట్ ఏర్పాటు చేసి... వాటిని తాజాగా వండి విక్రయిస్తున్నారు. అందరికీ ప్రియమైన వంటకమైన హలీమ్ భారతీయులకే కాదు... విదేశీయుల మనసులనూ దోచేసుకుంది. దీన్ని రుచి చూడటం కోసం విదేశీయులు సైతం సంవత్సరం మొత్తం వేచిచూడటం విశేషం.


Tags

Read MoreRead Less
Next Story