RAIN ALERT: చురుగ్గా రుతు పవనాలు... విస్తారంగా వర్షాలు

అన్ని రాష్ట్రాలను తాకిన రుతుపవనాలు.. భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు.. జమ్ముకశ్మీర్‌లో పాఠశాలలకు సెలవు...

దేశంలోకి రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలను రుతు పవనాలు తాకినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అవి చాలా చురుగ్గా కదులుతున్నాయని.. వచ్చే రెండు రోజుల్లో దేశం మొత్తం ఆవరించి భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, ముంబయిలలో కుండపోత కురుస్తోంది. ముంబైలో గరిష్టంగా 18 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు ఉత్తర భారత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్‌లోభారీ వర్షాలకు చండీగఢ్-మనాలి హైవేపై కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్ జామ్ అయింది.

రుతు పవనాల ప్రభావంతో జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్‌లో భారీ వర్షాలకు రాళ్లు, కొండచరియలు విరిగిపడటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు పదో తరగతి వరకు అన్ని విద్యా సంస్థలను మూసేయాలని రాంబన్‌ పరిపాలన యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల హెచ్చరికలతో రాంబన్ జిల్లాలో పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించామని అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో ఈనెల 28 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇటు.. వరద బీభత్సంలో అతలాకుతలమైన అస్సాంలో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ఇప్పటికీ 15 జిల్లాల్లో దాదాపు 2 లక్షల 72 వేల మందిపై వరద ప్రభావం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. బజలి, బక్సా, బార్‌పేట, దర్రాంగ్, ధుబ్రి, దిబ్రూగర్, గోల్‌పరా, గోలాఘాట్, జోర్హాట్, కమ్‌రూప్, లఖింపూర్, నాగావ్, నల్బరీ, తముల్‌పూర్ జిల్లాల్లోని 37 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 874 గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వెల్లడించింది. ఒక్క బార్‌పేట జిల్లాలోనే లక్షా 70 వేల మంది వరద ధాటికి ప్రభావితమయ్యారని తెలిపింది. అస్సాంలో వరదల కారణంగా జిల్లాల్లో 5936.63 హెక్టార్లలో పంట నీట మునిగింది. 43 వేల మంది ఇప్పటికీ సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story