ఆర్మీకి సెల్యూట్ చేస్తున్న సిక్కిం పర్యాటకులు

ఆర్మీకి సెల్యూట్ చేస్తున్న సిక్కిం పర్యాటకులు
3,500 మంది పర్యాటకులను రక్షించిన సైన్యం

భారీ వర్షాల కారణంగా సిక్కింను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో సుమారు 3500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిని ఇండియన్ ఆర్మీ సురక్షితంగా కాపాడింది. తక్షణమే స్పందించిన ఆర్మీ సేవలను పర్యాటకులు కొనియాడుతున్నారు. సిక్కిం రాష్ట్రాన్ని కుండపోత వర్షాలు గడపడలాడిస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది.

వాటికి తోడు, కొండ చరియలు విరిగిపడడం, రహదారులపై భారీ వృక్షాలు పడిపోవడం వంటివి జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. దీంతో స్థానికులే కాదు సిక్కిం ప్రకృతి అందాలను చూడటానికి వెళ్లిన పర్యాటకులు సైతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం ఎదురు చూశారు. రోడ్డు మార్గాలు మూసుకుపోవడం, ఎలాంటి సమాచార సాధనాలు పని చేయకపోవడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉండిపోయారు. వారిని భారతీయ ఆర్మీకి చెందిన త్రిశక్తి కార్ప్స్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సురక్షితంగా కాపాడగలిగారు. వేగంగా ప్రవహిస్తున్న వరద ప్రవాహాల మీదుగా తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేసి పర్యాటకులను కాపాడారు. పర్యాటకులకు ఆహారం, వైద్యం అందించారు. తాత్కాలిక వసతి కల్పించారు.సిక్కిం లోని పలు ప్రాంతాలలో ఇలాంటి సంఘటనలే చోటుచేసుకున్నాయి.

చాలా చోట్ల హోటల్ లోనే పర్యాటకులు ఉండిపోవాల్సి వచ్చింది. వందల సంఖ్యలో కార్లు, బైకులు బురదలో కూరుకుపోయాయి. ఎక్కడికక్కడ తలదాచుకోవడానికి పర్యటకులు నానా ఇబ్బందులు పడ్డారు. త్రిశక్తి కార్ప్స్, ఇండియన్ ఆర్మీ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది రాత్రీ, పగలూ పనిచేసి, పర్యాటకుల రక్షణ, సౌకర్యార్థం ఫ్లాష్ వరద ప్రాంతంపై తాత్కాలిక క్రాసింగ్‌ను నిర్మించారు. కొన్ని చోట్ల వంతెనలు ఏర్పాటు చేశారు. రోడ్డు కనెక్టివిటీని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేశారు. పలు చోట్ల పర్యాటకులు నదిని దాటడానికి సహాయం చేసారు.

గంటల తరబడి అదే ప్రదేశంలో ఉండిపోయిన వారికి ఆహారం, అవసరం అయిన వారికి వైద్య సహాయం అందించారు. బస్సులు వంటి రవాణా సౌకర్యాలు కల్పించారు. అయితే కొన్ని చోట్ల టూరిస్టులను తీసుకువెళ్తున్న బస్సుల పైన కూడా కొండ చరియలు విరిగిపడిన సంఘటన జరిగింది. కానీ ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. అంతకుముందు మే 20, 2023న ఉత్తర సిక్కింలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. దీని తరువాత, 500 మంది పర్యాటకులను భారత సైన్యం సైనికులు రక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story