కేంద్రంపై జాక్ డోర్సే విమర్శలు..ఖండించిన ఐటీ మంత్రి

కేంద్రంపై జాక్ డోర్సే విమర్శలు..ఖండించిన ఐటీ మంత్రి
ట్విట్టర్ మాజీ సీఈఓ వ్యాఖ్యలను తిప్పి కొట్టిన కేంద్ర ఐటీ మంత్రి

భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, మోడీ ప్రభుత్వం పైవిమర్శలు చేశారు ట్విట్టర్​ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈ వో జాక్​ డోర్సే. రైతు నిరసనల నేపథ్యంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న అకౌంట్లను బ్లాక్​ చేయాలని ట్విట్టర్​కు అభ్యర్థనలు అందాయని, ఈ విషయం పై ప్రభుత్వం తమను తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని ఆరోపించారు. అయితే ఈ విమర్శలపై కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెంటనే స్పందించారు. డోర్ సే సీఈ వో గా ఉన్నప్పుడు ట్విట్టర్, భారత చట్టాలను పదేపదే ఉల్లంఘించిందన్నారు. అమెరికాలో ఏదైనా అంశంపై తప్పుడు ప్రచారం జరిగినప్పుడు ట్విట్టర్ స్వయంగా దానిని తన అకౌంట్లో నుంచి తొలగిస్తుందని, అదే భారతదేశానికి వచ్చేటప్పటికీ ఆ పని చేయలేకపోతున్నారన్నారు.

బ్రేకింగ్​ పాయింట్స్​ అనే ఓ యూట్యూబ్​ ఛానెల్​కు రీసెంట్గా ఇంటర్వ్యూ ఇచ్చారు డోర్సే. ఈ నేపథ్యంలో ఇండియాలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు. భారత దేశంలో ప్రజాస్వామ్య విలువలను ప్రశ్నిస్తూ. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రైతుల నిరసనలపై వస్తున్న సానుకూల స్పందనలను ట్విట్టర్​ నుంచి తొలగించాలని, లేకపోతే ఇండియాలో ట్విట్టర్​ను మూసేస్తామని కేంద్ర హెచ్చరించింది అన్నారు. పలువురు ఉద్యోగుల ఇళ్లపై దాడులు కూడా నిర్వహించింది అని ఆరోపించారు. 2020లో మూడు వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టింది కేంద్రం.

దీనికి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. లక్షలాది మంది రైతులు ఉద్యమించారు. 2021 నవంబర్​ వరకు ఆందోళనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో రైతులకు సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. అయితే రైతులు నిరసనల కార్యక్రమంలో చాలా తప్పుడు ప్రచారం జరిగిందని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ చెబుతున్నారు. ఆ సమయంలో ఫేక్ న్యూస్ ఆధారంగా పరిస్థితిని మరింత రెచ్చగొట్టే అవకాశం ఉన్నందున తప్పుడు సమాచారాన్ని ట్విట్టర్ నుంచి తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ప్రభుత్వం ఎవరిపైన దాడులు చేయలేదని, జైలుకు పంపలేదని స్పష్టం చేశారు. ఆ సమయంలో ట్విట్టర్ ఏకపక్షంగా వ్యవహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న విషయం పై ఇప్పటికీ ఆధారాలున్నాయన్నారు. డోర్సే హయాంలో ట్విట్టర్ కేవలం భారత చట్టాలను ఉల్లంఘించడమేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19 లను సైతం విస్మరించింది అన్నారు. అలాగే పక్షపాత వైఖరితో వ్యవహరిస్తూ అసత్య ప్రచారాలను తొలగించడానికి నిరాకరించిందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story