Bribe : భర్త తప్పుకు భార్య బలి

Bribe : భర్త తప్పుకు భార్య బలి
లంచం తీసుకుంటూ పట్టుబడిన భర్త, జైపూర్ మేయర్గా ఉన్న భార్య పదవి తొలగింపు

రాజస్థాన్‌లో భర్త లంచం తీసుకుంటూ ACBకి చిక్కడంతో అతని భార్య జయపుర మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. స్థలానికి సంబంధించిన లీజు వ్యవహారంలో ఆమె భర్త లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ఆమెను కూడా పదవి నుంచి తొలగించింది. అంలాగే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ వార్డు కార్పొరేటర్‌ పదవి నుంచి కూడా సస్పెండ్‌ చేసింది.

మేయర్‌ మునేశ్‌ గుర్జార్‌ భర్త సుశీల్‌ గుర్జార్‌ ఒక భూమి లీజ్‌ వ్యవహారంలో 2 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ వ్యవహారమంతా.. మేయర్‌ స్వగృహంలోనే జరిగింది. ఆ సమయంలో మేయర్ కూడా ఇంట్లోనే ఉన్నారు. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడి చేసి మేయర్‌ భర్తను పట్టుకున్నారు. నారాయణ సింగ్‌, అనిల్‌ దూబే అనే మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. మేయర్‌ ఇంటి నుంచి 40 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భర్త లంచం తీసుకుంటున్నప్పుడు మేయర్‌ మునేశ్‌ అక్కడే ఉండడంతో.. అవినీతి వ్యవహారంలో ఆమె హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో మునేశ్‌ గుర్జార్‌ను సస్పెండ్‌ చేస్తూ రాజస్థాన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు నంబర్‌ 43 కార్పొరేటర్‌ పదవి నుంచి కూడా సస్పెండ్‌ చేసింది. సుశీల్‌ గుర్జార్‌ కు సహాయకులుగా ఉన్న నారాయణ్ సింగ్ నివాసంలోనూ మరో రూ.8 లక్షల నగదు లభ్యమైంది. ఈ ఘటనతో మరోసారి అధికార కాంగ్రెస్‌పై ప్రతిపక్ష బీజేపీ విమర్శలను ఎక్కుపెట్టింది. ఇది దోపిడీ, అబద్ధాల ప్రభుత్వమని మండిపడింది.


రాజస్థాన్‌లో ఈ ఏడాది శాసనసభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఇప్పటికే ‘రెడ్ డెయిరీ’ వ్యవహారం తలనొప్పిగా మారగా ఇప్పుడు ఇది రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టేసింది. అయితే ఈ అరెస్ట్ తో బీజేపీ విమర్శలను ప్రభుత్వం తిప్పికొట్టింది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ మేయర్ భర్తను అరెస్టు చేయడంమే అవినీతిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందనడానికి నిదర్శనమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఎదురుదాడికి దిగారు. రాజస్థాన్‌లో మాత్రమే ఏసీబీ ఇలా పనిచేస్తుందని, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి అనుమతి లభించదని, ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఉన్న కారణాలతో కలెక్టర్‌, ఎస్పీ, రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులను, ఇప్పుడు మేయర్‌ భర్తను అరెస్ట్‌ చేశామని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story