Chandrayan 3: విక్రమ్ పంపిన చందమామ చిత్రం

Chandrayan 3: విక్రమ్ పంపిన చందమామ చిత్రం
ట్విట్టర్ వేదికగా ఫోటోలు షేర్‌ చేసిన ఇస్రో

భారతదేశమే కాదు ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ 3 ప్రయోగం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసుకున్న చంద్రయాన్ 3 చివరి అంకానికి చేరుకుంది. చంద్రయాన్ 3 యొక్క ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన ల్యాండర్ విక్రమ్ నుంచి తాజాగా చంద్రుడికి సంబంధించిన కొన్ని ఫొటోలు వచ్చాయి. ల్యాండర్ ఇమేజర్ (LI) కెమెరా-1 ద్వారా తీసిన అద్భుతమైన చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసింది.

ఈ ఫొటోలలో చంద్రుడి ఉపరితలంపై క్రేటర్లు (బిలం) స్పష్టంగా కనపిస్తున్నాయి. ఆ క్రేటర్ల పేర్లను కూడా ఇస్రో వెల్లడించింది. ఫ్యాబ్రీ క్రేటర్, గియార్డనో బ్రునో క్రేటర్, హర్కేబి జే క్రేటర్‌ ఫొటోలను తీసి విక్రమ్ ల్యాండర్ పంపించినట్లు ఇస్రో తెలిపింది. వాటిలో జియోర్డానో బ్రూనో క్రేటర్..ఇది చంద్రునిపై ఇటీవలే గుర్తించిన అతి పెద్ద బిలాల్లో ఒకటి. LI కెమెరా -1..దాదాపు 43 కి.మీ వ్యాసం కలిగిన హర్ఖేబి J బిలం యొక్క ఫొటోలను కూడా పంపింది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన ల్యాండర్‌.. చంద్రుడికి మరింత చేరువైంది. ఇది ప్రస్తుతం సొంతంగా చంద్రుడి కక్ష్యలో తిరుగుతోంది. శుక్రవారం సాయంత్రం చేపట్టిన డీబూస్టింగ్‌ (వేగాన్ని తగ్గించే) ప్రక్రియ విజయవంతమైనట్లు ఇస్రో వెల్లడించింది.


ప్రస్తుతం విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన ల్యాండర్‌ మాడ్యూల్‌ నిర్దేశించినట్టుగానే చంద్రుడి కక్ష్యలో తిరుగుతోంది. ఆగస్టు 20న తెల్లవారుజామున 2 గంటలకు చివరిదైన రెంబో బూస్టింగ్‌ ప్రక్రియను చేపట్టనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ రెంబో బూస్టింగ్‌ ప్రక్రియ తర్వాత ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపానికి చేరుకుంటుందని స్పష్టం చేసింది. అన్నీ అనుకున్న ప్రకారం జరిగి పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టు 23వ తేదీన సాయంత్రం దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ అడుగు పెట్టనుంది.

జులై 14న శ్రీహరి కోట నుంచి బయలుదేరిన చంద్రయాన్ 3... 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్ట్ 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే ప్రయత్నంలో ఉంది.అయితే, ఆగస్ట్ 11న రష్యా ప్రయోగించిన లూనా 25 కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే లూనా 25 లోని కెమెరాలు తీసిన ఫోటోలను రష్యన్ స్పేస్ ఏజెన్సీ విడుదల చేసింది.అన్నీ సవ్యంగా సాగితే ఆగస్ట్ 21నే చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు సన్నాహాలు చేస్తోంది రష్యా. అయితే ఈ ప్రయత్నంలో ఎవరు ముందుంటారు అన్నది వేచి చూడాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story