Chandrayaan-3: మరో రెండు రోజుల్లో చంద్రుడిపై సూర్యోదయం..

Chandrayaan-3:  మరో రెండు రోజుల్లో చంద్రుడిపై సూర్యోదయం..
విక్రమ్, ప్రజ్ఞాన్‌ రీస్టార్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఇస్రో

చంద్రుడి దక్షిణ ధ్రువంపై మరో రెండు రోజుల్లో తెల్లవారబోతోంది. జాబిల్లి ఉపరితలంపై నిద్రాణ స్థితిలో ఉన్న చంద్రయాన్‌-3 విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లను రీస్టార్ట్ చేయడం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రాత్రిపూట అక్కడి మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలను ల్యాండర్, రోవర్ తట్టుకోవడం.. సూర్యరశ్మిని స్వీకరించి రీఛార్జి కావడంపైనే ఇది ఆధారపడి ఉంది. చంద్రయాన్‌-3 ల్యాండింగ్ ప్రదేశం శివ్‌శక్తి పాయింట్‌ వద్ద పగటి సమయం ముగియడంతో సెప్టెంబరు 2, 4 తేదీల్లో ల్యాండర్‌, రోవర్‌లను ఇస్రో నిద్రపుచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే అవి చంద్రుడికి సంబంధించి విలువైన సమాచారాన్ని మనకి అందించాయి.


జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఒకరోజు అంటే భూమిపై 14 రోజులు పనిచేసేలా చంద్రయాన్-3ను రూపొందించారు. ల్యాండింగ్‌ ప్రాంతంలో సూర్యోదయం కోసం మరో రెండు రోజులు వేచిచూడాల్సి ఉందని, సెప్టెంబరు 22 తర్వాత రోవర్‌, ల్యాండర్‌లను మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, అక్కడ రాత్రిపూట వాతావరణం తట్టుకుని, అవి మళ్లీ రీస్టార్ట్ అయితే అద్భుతమే. ఒకవేళ విక్రమ్, ప్రజ్ఞాన్ నిద్రాణ స్థితి నుంచి మేల్కోనకపోయినా వాటిని భూ కక్ష్యలో ఉన్న వస్తువుల మాదిరిగా అంతరిక్ష వ్యర్థాలుగా పరిగణించరు. ఇవి చంద్రుడి ఉపరితలంపై ఉంటాయి. జాబిల్లిపై అన్వేషణలో భారత్ మార్గదర్శక విజయాలను సూచిస్తాయి. చంద్రునిపై భారతదేశానికి శాశ్వత రాయబారులుగా ఉంటాయి. చంద్రుడిపై అన్వేషణలో భారత్ సాహసోపేతమైన ముందడుగును చంద్రయాన్-3 సూచిస్తుంది.


సూర్య కాంతి ద్వారా పనిచేసే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్.. క్కడి మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతకు పనిచేయకుండా పోతాయని భావించిన ఇస్రో పగటి సమయం ఉండగానే వాటిని నిలిపివేసింది. ఈ క్రమంలోనే ముందుగానే స్లీప్ మోడ్‌లో ఉంచింది. చంద్రయాన్-3 అనుకున్న లక్ష్యానికి మించి అద్భుతంగా పనిచేసిందని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. ఫలితాలతో సంబంధం లేకుండా ఇవి అంతరిక్ష పరిశోధనలో భారత్ అద్భుతమైన విజయాలు, చంద్రుని రహస్యాలను ఛేదించాలనే శాస్త్రవేత్తల తపనకు ఎప్పటికీ నిదర్శనంగా మిగిలిపోతాయి. చంద్రుడి ఉపరితలంపై సిలికా, కాల్సియం, హైడ్రోజన్, ఆక్సిజన్ సహా అనేక మూలకాల జాడను చంద్రయాన్-3 కనిపెట్టింది. వాటికి సంబంధించిన వివరాలను కూడా ఇస్రో భూ కేంద్రానికి పంపించింది. అత్యంత ఖరీదైన మూలకాల్లో ఒకటైన హీలియం 3.. చంద్రుడిపై సమృద్ధిగా ఉందని ఇప్పటివరకు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.

Tags

Read MoreRead Less
Next Story