North Rains: మళ్ళీ వరద ముంచెత్తే అవకాశం..

North Rains: మళ్ళీ వరద ముంచెత్తే అవకాశం..
మళ్లీ భారీ వర్షం కురియడంతో మరోసారి వరద ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీవాసులు ఆందోళనకు గురవుతున్నారు.

ఉత్తర భారత దేశంలో వరదలు తగ్గుముఖం పట్టినా.. పరిస్థితి ఇప్పుడే సాధారణ స్థితికి వచ్చే సూచనలు కనిపించడం లేదు.ఢిల్లీని ముంచెత్తిన వరద ప్రవాహం కాస్త నెమ్మదించింది. కానీ, మళ్లీ భారీ వర్షం కురియడంతో మరోసారి వరద ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీవాసులు ఆందోళనకు గురవుతున్నారు.యమునా నీటి మట్టం 205 మీటర్ల దిగువకు తగ్గినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రమాదకర నీటి మట్టమైన 205.33 కంటే ఇది ఎక్కువే. మళ్లీ వర్షాలు లేకపోతే నీటిమట్టం మరింత తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు ప్రధాని మోదీ వరద పరిస్థితిని తెలుసుకున్నారు. ఢిల్లీ పరిస్థితిపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాతో మాట్లాడి పరిస్థితిపైఊ ఆరా తీశారు. ఇక యమున ప్రవాహం తగ్గిందని.. త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి చేరుతుందని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. చాలా మంది ఢిల్లీవాసులు తిరిగి తమ గృహాలకు చేరుకుంటున్నారని చెప్పారు. మరోవైపు యమునా తీరాన ఉన్న మెట్రోస్టేషన్‌ను తెరిచినట్లు ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది.

ఇక ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో 10 మంది వరదల కారణంగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. నొయిడాలోని దనాకౌర్‌ ప్రాంతంలో ఇద్దరు యువకులు యమునా ప్రవాహంలో కొట్టుకుపోయారు. యూపీలోని గౌతమ్‌ బుద్ధానగర్‌లో వరద తీవ్రత కొనసాగుతోంది. ఇక ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యుమున ప్రవాహాలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో వరదల కారణంగా 8 వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది. రాష్ట్రంలోని పలు మౌలిక వసతులను.. మెరుపు వరదలు ధ్వంసం చేశాయి. అస్సాంలో బిశ్వనాథ్‌ సబ్‌డివిజన్‌లో వరద తీవ్రత కొనసాగుతోంది. దాదాపు 32వేల 400 మందిపై దీని ప్రభావం పడింది. 47 గ్రామాలు నీట మునగగా.. 858 హెక్టార్ల మేర పంట దెబ్బతింది.

తాజాగా దాదాపు 6వేల 600 మంది అమర్‌నాథ్‌ యాత్రికులు జమ్మూ నగరం నుంచి దర్శనానికి బయల్దేరినట్లు అధికారులు వెల్లడించారు. వీరు పహల్గాం, బల్తల్‌ క్యాంపులకు వెళ్లనున్నారు. ఉత్తరాఖండ్‌లో చమోలీ జిల్లాలో బద్రీనాథ్‌ హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఎన్‌హెచ్‌-109 జాతీయ రహదారి.. దాదాపు ఏడు చోట్ల మూతపడిందని అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లోని మొత్తం 33 జిల్లాలకుగాను.. 15 జిల్లాల్లో ఈ సారి అసాధారణ వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఒక్క జిల్లాలో కూడా సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదు కాలేదని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story