239వ సారి పద్మరాజన్ పోటీ.. పట్టువదలని రాజకీయ విక్రమార్కుడు

239వ సారి పద్మరాజన్ పోటీ.. పట్టువదలని రాజకీయ విక్రమార్కుడు

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఇప్పటికే 238 సార్లు పోటీచేసి ఓటమి పాలయ్యారాయన. ఆయన్ను చాలామంది 'ఎలక్షన్ కింగ్' అని అంటుంటారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి రాష్ట్రపతి దాకా వివిధ ఎన్నికల్లో ఆయన పోటీ పడి ఓడిపోయారు. తమిళనాడులోని మెట్టూరు పట్టణానికి చెందిన టైర్ల రిపేర్‌ షాప్‌ ఓనర్‌ 65 ఏళ్ల పద్మరాజన్‌ (Padmarajan) 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ 239వసారి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయన తమిళనాడులోని ధర్మపురి పార్లమెంట్‌ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. ఇప్పటికే నామినేన్‌ కూడా వేశారు.

1988 సంవత్సరం నుంచి పలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పద్మరాజన్.. వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌, నరేంద్ర మోడీ, రాహుల్‌ గాంధీలతో తలపడి ఓడిపోయారు. ''ఎన్నికల్లో విజయం ప్రాధాన్యం కాదు. ప్రత్యర్థి ఎవరు? అనేది నేను అస్సలు పట్టించుకోను. ఎన్నికల్లో పోటీ చేస్తూ ఎన్నిసార్లు ఓడిపోవటానికైనా నేను సిద్ధం. నేను ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి, దాదాపు కోటి రూపాయల ఎన్నికల డిపాజిట్లు పొగొట్టుకున్నాను'' అని పద్మరాజన్‌ అంటుంటారు. అయితే తాను ఒక్కసారి గెలిచానని.. కానీ అది ఎన్నికల్లో కాదని పద్మరాజన్‌ తెలిపారు.

పలు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో.. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించడంలో విజయం సాధించానన్నారు పద్మరాజన్. తాను 2011లో కొంతలో కొంత మెరుగైన ప్రదర్శన కనబరిచినట్లు పేర్కొన్నారు. మెట్టూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా రాదనుకున్నాననీ.. ఐతే... 6,273 ఓట్లు దక్కించుకున్నానని అన్నారు. పద్మరాజన్ టైర్‌ రిపేర్‌ షాప్‌ నడపటంతో పాటు హోమియోపతి ఔషధాలు తయారీ, లోకల్‌ మీడియా ఎడిటర్‌గా కూడా పని చేస్తున్నారు. అయితే ఎన్ని పనులు చేసినా.. ఎన్నికల బరిలో దిగటమే తనకు చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story