Prajwal Revanna : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్​ కుంభకోణం

Prajwal Revanna : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్​ కుంభకోణం
బయటపడుతున్న దారుణాలు, దేశ రాజకీయాల్లోనూ ప్రకంపనలు

కర్ణాటకలో రాజకీయాల్లో హసన్‌సెక్స్‌ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. జనతాదళ్‌ సెక్యులర్‌ పార్టీ నుంచి ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను సస్పెండ్‌ చేసిన క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగం పుంజుకుంది. దర్యాప్తునకు 18 మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. హొళెనరసీపుర ఠాణాలో ఫిర్యాదు చేసిన 47 ఏళ్ల బాధితురాలు వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేసింది. కేసులో ఏ1గా ఉన్న హెచ్‌డీ రేవణ్ణకు సిట్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో విచారణకు హాజరు కావాలని సూచించింది.

మరోవైపు.. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై చర్యలు తీసుకోవాలని కర్ణాటకలో ఆందోళనలు ఉద్ధృతమ‌య్యాయి. ప్రజ్వల్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌, NSUI, తదితర విద్యార్థి సంఘాలు బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. కొన్ని చోట్ల విద్యార్థిణులు.. రేవణ్ణ దిష్టిబొమ్మను చెప్పుతో కొడుతూ నిరసనలు తెలియజేశారు. ప్రజ్వల్‌ చేతిలో వందలాది మంది మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వీడియోలు నాలుగేళ్ల కిందటివని హెచ్‌డీ రేవణ్ణ బుకాయించుకోవడం సిగ్గు చేటని కాంగ్రెస్‌ మండిపడింది. హాసన సెక్స్‌ కుంభకోణం దేశ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. భాజపాతో జేడీఎస్‌ పొత్తు ఉండటంతో.. ఇది మరింత తీవ్రమైంది. మోదీ పరివార్‌లో భాగమైన నేరస్థులకు అరెస్ట్‌ల నుంచి రక్షణ లభిస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. సందేశ్‌ఖలీ ఘటన గురించి ప్రసంగాలు చేసే మోదీ.. హసన్‌ ఘటనపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజ్వల్‌పై ఆరోపణలు ఉన్నాయని ముందే తెలిసి కూడా ఆయన కోసం మోదీ ఎందుకు ప్రచారం చేశారని నిలదీశారు. బ్రిజ్‌భూషణ్‌, ఉన్నావ్‌, ఉత్తరాఖండ్‌.. ఇప్పుడు హాసన ఘటన ఇలా ప్రతి విషయంలో ప్రధాని మౌనం వహించడం నేరస్థులకు మరింత ధైర్యాన్ని ఇస్తోందని ఆరోపించారు. హిందూ మహిళల మాంగల్యాలపై మాట్లాడే మోదీ ఈ దారుణ ఘటనకు కూడా సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సాయంతోనే ప్రజ్వల్‌ దేశం దాటినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. ఇందుకు ప్రణాళిక రచించింది మాజీ ప్రధాని దేవగౌడ అని వ్యాఖ్యానించారు.

వందల మంది మహిళలు, యువతులను లైంగికంగా ప్రజ్వల్‌ రేవణ్ణ వేధించిన వీడియోలు బయటకు ఎలా వచ్చాయన్నది ఆసక్తిగా మారింది. ప్రజ్వల్‌ డ్రైవర్‌గా పనిచేసిన కార్తిక్‌ ద్వారా ఈ వీడియోలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. HD రేవణ్ణ కుటుంబానికి ఆ యువకుడు ఒకప్పుడు బినామీగా ఉండేవాడన్న అనుమానం ఉంది. కార్తిక్‌కు సంబంధించిన స్థలాన్ని రేవణ్ణ కుటుంబం లాక్కోవడంతో కక్ష పెంచుకున్నట్లు తెలిసింది.తనకు దేవరాజే గౌడ మాత్రమే సాయం చేయగలరన్న ఆశతో.. ప్రజ్వల్‌ వీడియోలను భాజపా అభ్యర్థికి పంపించారు. దేవరాజేగౌడ వాటిని మరికొందరు భాజపా నాయకులకు పంపారు. అయితే తన నుంచి వీడియోలు బయటకు రాలేదని దేవరాజే గౌడ చెబుతున్నారు. కార్తిక్‌ ఆ వీడియోలను తనతో పాటు కాంగ్రెస్‌ నేతలకు కూడా ఇచ్చి ఉండొచ్చని దేవరాజే గౌడ అనుమానిస్తున్నారు..

అశ్లీల వీడియోల్లో ప్రజ్వల్‌తో కనిపించిన వారిలో ఎక్కువ మంది, ఉద్యోగాలు, బదిలీలు, పదోన్నతుల కోసం వచ్చిన యువతులే ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రజ్వల్‌ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమగ్ర వివరాలు ఇవ్వాలని కర్ణాటక DGPకి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. సైబర్‌ క్రైం నిపుణుల సాయంతో వీడియోలు వైరల్‌ కాకుండా అడ్డుకోవాలని, వాటిని షేర్‌ చేస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది

Tags

Read MoreRead Less
Next Story