ఆటో డ్రైవర్ కస్టమర్లకు ఉచితంగా టమోటాలు.. ఇక్కడే ఓ ట్విస్ట్

ఆటో డ్రైవర్ కస్టమర్లకు ఉచితంగా టమోటాలు.. ఇక్కడే ఓ ట్విస్ట్
అవునా.. టమోటాలు ఉచితంగా ఇస్తున్నారా.. అయితే ఎక్కడో అర్జెంటుగా తెలుసుకోవలసిందే అనుకుంటున్నారు కదూ..

అవునా.. టమోటాలు ఉచితంగా ఇస్తున్నారా.. అయితే ఎక్కడో అర్జెంటుగా తెలుసుకోవలసిందే అనుకుంటున్నారు కదూ.. అవును మరి టమోటా వేసిన కూర తిని ఎన్ని రోజులైంది. ఎక్కడో చెబితే వెళ్లి తెచ్చుకుందామనుకుంటున్నారా.. ఇక్కడెక్కడా కాదు చండీగఢ్‌లో. అంత దూరం వెళ్లడం కష్టం కానీ,, ఇంతకీ ఎందుకు ఉచితంగా టమోటాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం..

ఒక ఆటో-రిక్షా డ్రైవర్ తన ఆటో ఎక్కిన ప్రయాణీకులు ఉచితంగా టమోటాలు ఇస్తున్నాడు. అయితే కొన్ని షరతులు ఉన్నాయి అని చెబుతున్నాడు.. ఇంతకీ ఏమిటో ఆ షరతులు అని ఆరా తీస్తే.. వ్యాపారులు తమ పోటీదారుల మధ్య నిలదొక్కుకోవడానికి కొన్ని పద్దతులను వినియోగదారులకు ఎర వేస్తుంటారు.. పెరిగిన టమోటా ధరలతో వినియోగదారుడు తల్లడిల్లుతున్నాడు.

ప్రజలు ఈ కూరగాయలను కొనడం గురించి తీవ్రంగా ఆలోచిస్తుండగా, చండీగఢ్‌లోని ఒక ఆటోడ్రైవర్ తన రిక్షాలో ప్రయాణించే ఎవరికైనా ఉచితంగా ఒక కిలో టమోటాలు అందజేస్తాడు. అయితే ఐదు రైడ్‌లు తీసుకునే వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది అని ఓ ట్విస్ట్ పెట్టాడు.. ఎక్కడికైనా వెళ్లాలంటే ఏదో ఒక ఆటో ఎక్కాల్సిందే కదా.. అదేదో ఇతడి ఆటోనే ఎక్కితే కిలో టమాటాలైనా వస్తాయని అనిల్ ఆటో ఎక్కడానికి క్యూ కట్టేస్తున్నారు కస్టమర్లు.

ఇది మాత్రమే కాదు, అనిల్ గత 12 సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికులకు ఉచిత ఆటో రైడ్‌లను అందిస్తున్నారు. ఇంకా అతను గర్భిణీ స్త్రీల దగ్గర కనీస చార్జీలు కూడా వసూలు చేయకుండా ఉచితంగా ఆసుపత్రులకు తీసుకువెళతాడు."ఆటో నా ఆదాయ వనరు. నా కుటుంబపోషణకు ఏకైక మార్గం. కానీ ఇలాంటి సేవలను అందించడం ద్వారా తనకు గొప్ప సంతృప్తి లభిస్తుందని అంటారు అనిల్.

ఇటీవల, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని ఒక షూ-స్టోర్ యజమాని తన దుకాణం నుండి బూట్లు కొనుగోలు చేస్తే వారికి 2 కిలోల టమోటాలు ఉచితంగా అందించే పథకాన్ని ప్రకటించారు. ప్రత్యేక సేల్ ఆఫర్ కింద, వినియోగదారులు రూ.1,000 నుండి రూ.1,500 ధరల శ్రేణిలో షూలను కొనుగోలు చేస్తే, వారు 2 కిలోల టమోటాలు ఉచితంగా పొందేందుకు అర్హులు.

మధ్యప్రదేశ్‌లో, ఒక దుకాణదారుడు తన దుకాణంలో స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేసే వారికి ఉచితంగా టమోటాలు ఇస్తున్నాడు. రిటైల్ వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి, ఢిల్లీ-ఎన్‌సిఆర్, పాట్నా మరియు లక్నో వంటి ఎంపిక చేసిన నగరాల్లో కేంద్రం టమోటాలను కిలోకు రూ.80 తగ్గింపుతో విక్రయిస్తోంది. టమోటా ధర తగ్గే వరకు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి.

Tags

Read MoreRead Less
Next Story