రూ. 8వేలు లేక బిడ్డ మృతదేహాన్ని బ్యాగులో దాచి..

రూ. 8వేలు లేక బిడ్డ మృతదేహాన్ని బ్యాగులో దాచి..
ప్రభుత్వాలు ఎన్ని మారినా పేదవాడి తలరాత మారట్లేదు..

ప్రభుత్వాలు ఎన్ని మారినా పేదవాడి తలరాత మారట్లేదు.. ఏళ్ల తరబడి అవే అగచాట్లు అవే తిప్పలు.. కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేస్తే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది.

చేతిలో డబ్బుల్లేక, సాయం చేసేవారు లేక గుండెల్లో బాధను దిగమింగుకుంటూ బ్రతుకు భారంగా గడుపుతుంటారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసే నాయకులు మాత్రం తమ స్వలాభం కోసం మాటలతో ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్‌కు రూ.8000 చెల్లించలేని కారణంగా, చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని తండ్రి బస్సులో ఇంటికి రావాల్సి వచ్చింది.

కలియగంజ్ రాష్ట్రంలోని ఉత్తర దినాజ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి డబ్బు లేకపోవడంతో అంబులెన్స్‌ని తీసుకోలేకపోయాడు. ఐదు నెలల చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో ఉంచి కాలియాగంజ్‌కు తీసుకెళ్లాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనం అయింది. మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా లేదని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. దీనిపై ప్రతిపక్ష నేత శుభేందు అధికారి మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు.

కలియాగంజ్ బ్లాక్‌లోని ముస్తఫానగర్ గ్రామపంచాయతీలోని డంగీపరా గ్రామానికి చెందిన అసీమ్ దేవ్ శర్మ భార్య కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఐదు నెలల తర్వాత పిల్లలిద్దరూ అస్వస్థతకు గురయ్యారు. భార్యాభర్తలిద్దరూ గత ఆదివారం కలియాగంజ్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తమ చిన్నారులను చేర్చారు.

టెస్టుల పేరుతో అప్పటికే చికిత్స కోసం రూ.16 వేలు ఖర్చు పెట్టారు ఆ పేద దంపతులు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి చిన్నారి చనిపోయింది. అసిమ్ వృత్తి రీత్యా వలస కూలీ. ఆస్పత్రిలో అంబులెన్స్‌ కోసం ప్రయత్నించాడు. అందుకు రూ.8వేలు అడిగారు సిబ్బంది. కానీ తన వద్ద అంత డబ్బు లేదని చెప్పాడు. అయినా సిబ్బంది కనికరించలేదు.. చేసేదేం లేక ఆదివారం ఉదయం బస్సులో కుమారుడి మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని రాయగంజ్ చేరుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story