Article 370: ఆగస్టు 2 నుంచి పూర్తిస్థాయి విచారణ

Article 370: ఆగస్టు 2 నుంచి పూర్తిస్థాయి విచారణ
370 ఆర్టికల్‌ రద్దుపై ఆగస్టు 2నుంచి రోజువారీ విచారణ... సోమ, శుక్ర వారాలో మినహా రోజు విచారిస్తామన్న రాజ్యాంగ ధర్మాసనం

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే అధికరణ 370రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై వచ్చే నెల 2వ తేదీ నుంచి పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 370 ఆర్టికల్‌ రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. సోమ, శుక్రవారాలు మినహా మిగతా రోజుల్లో పిటిషన్లపై రోజువారీ విచారణ ఉంటుందని జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ , జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్‌ గవాయ్ , జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా ఉన్న రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ఈనెల 27వ తేదీలోపు సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు, దస్త్రాలు సమర్పించాలని ఆదేశించింది. ఆ తర్వాత ఎలాంటి పత్రాలు స్వీకరించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం, పిటిషనర్లు తమ అభిప్రాయాలు సమర్పించే విషయమై వారికి సాయంగా ఉండేందుకు ఇద్దరు న్యాయవాదులను నియమించింది.


ఆర్టికల్ 370 రద్దును సవాలు చేసిన పిటిషనర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించాలని కోరుతూ ఐఏఎస్ అధికారి షా ఫైజల్, శెహలా రషీద్‌ చేసిన అభ్యర్థనకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఆ ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయని సుప్రీం కోర్టుకు కేంద్రం సోమవారం అఫిడవిట్‌ సమర్పించింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. జమ్మూ, కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీని తర్వాత స్థానికంగా హింసాత్మక ఘటనలు తగ్గిపోయాయని, అభివృద్ధిలో, సుసంపన్నతలో కశ్మీర్‌ దూసుకుపోతోందని తన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. తీవ్రవాద దాడులు, మతమార్పిడి నెట్‌వర్క్‌ కార్యకలాపాలవంటివి గత చరిత్రేనని వివరించింది. గత మూడేళ్లుగా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు పనిచేస్తున్నాయని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్‌ సమర్పించింది.


కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించిన రాజ్యాంగ ధర్మాసనం తాము విచారించనున్న కేసుపై ఈ అఫిడవిట్‌ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.

జమ్ముకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన పునర్వ్యవస్థీకరణ చట్టం 2019ని సవాల్‌ చేస్తూ ప్రైవేట్ వ్యక్తులు, న్యాయవాదులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశాయి.

Tags

Read MoreRead Less
Next Story