Ayodhya: అయోధ్యలో భక్తుల రద్దీ..

Ayodhya: అయోధ్యలో భక్తుల రద్దీ..
క్యూలైన్ల నిర్వహణపై టీటీడీ సూచనలు

శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అక్కడ నూతనంగా నిర్మించిన రామ మందిరంలో కొలువైన బాలక్‌ రామ్‌ను దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో బాలరాముడి ( Ram Lalla) దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది. దీంతో కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిస్తున్నాయి.

అయితే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఆలయం వద్ద క్యూ మేనేజ్ మెంట్ నిర్వహణ, ఇతర సౌకర్యాల ఏర్పాటులో సాంకేతిక సాయం అందించాలని, భక్తుల రద్దీ క్రమబద్దీకరణ, ఇతర అంశాలపై అవగాహన కల్పించాలని అయోధ్య రామమందిర ట్రస్ట్.. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరింది. దీంతో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (నేతృత్వంలోని అధికారుల బృందం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు భక్తుల రాక నియంత్రణ, క్యూ లైన్ల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు.

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు సైతం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఎంతమంది భక్తులు వస్తున్నా కూడా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చర్యలు తీసుకుంటోంది. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల సమయంలోనూ భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భక్తుల రద్దీని కంట్రోల్ చేయటం ఎలా అనే అంశంపై టీటీడీ సాయం కోరింది రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. తమకు సూచనలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ట్రస్టు విజ్ఞప్తి మేరకు టీటీడీ అధికారులు అయోధ్యకు వెళ్లి... ట్రస్టు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

కాగా, బాలక్‌ రామ్‌కు రోజూ మధ్యాహ్నం ఓ గంట సేపు విశ్రాంతి ఇవ్వనున్న విషయం తెలిసిందే. రోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు బాల రాముడికి విశ్రాంతి ఇస్తున్నారు. ఆ సమయంలో దేవాలయాన్ని మూసివేయనున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. బాలక్‌ రామ్‌ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ముందు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు దర్శనానికి అనుమతించేవారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాతి రోజు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో దర్శనం వేళలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పొడిగించారు. బాలక్‌రామ్‌కు తెల్లవారు జామున 4 గంటల నుంచి రెండు గంటల సేపు హారతి, అర్చన నిర్వహిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story