Sulabh International: "సులభ్‌" వ్యవస్థాపకులు బిందేశ్వర్‌ పాఠక్‌ కన్నుమూత

Sulabh International: సులభ్‌ వ్యవస్థాపకులు బిందేశ్వర్‌ పాఠక్‌ కన్నుమూత
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన పాఠక్‌... సమాజం, అణగారిన వర్గాల పురోగతి కోసం అహర్నిశలు కృషి... రాష్ట్రపతి, ప్రధాని నివాళి..

ప్రముఖ సామాజిక కార్యకర్త, సులభ్‌ ఇంటర్నేషనల్(Sulabh International) వ్యవస్థాపకులు బిందేశ్వర్‌ పాఠక్‌( Bindeshwar Pathak) తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ల వయసులో గుండెపోటు కారణంగా ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసినట్లు(passes away in Delhi) వైద్యులు తెలిపారు. బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా పోరాడిన బిందేశ్వర్‌ పాఠక్‌... కమ్యూనిటీ పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణానికి కృషి చేశారు. సఫాయీ కర్మచారీ కుటుంబాలతో కలిసి ఉండి, వారి కష్టాలను తెలుసుకున్న బిందేశ్వర్‌ పాథక్‌.. 1970లో సులభ్‌ ఇంటర్నేషనల్‌ను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఇళ్లల్లో 13 లక్షల టాయిలెట్లు, 5.4 కోట్ల ప్రభుత్వ టాయిలెట్లను నిర్మించారు. ఆయన చేసిన కృషికిగానూ 1991లో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌తో సత్కరించింది.


ఆయన భారత్ రైల్వేకు చెందిన స్వచ్ఛ రైల్‌ మిషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా పని చేశారు. బిందేశ్వర్ పాథక్ మృతి బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. పారిశుద్ధ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు ఆయన నాంది పలికారని తెలిపారు. పాథక్ మరణం దేశానికి తీరని లోటని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సమాజం, అణగారిన వర్గాల పురోగతి కోసం అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు అనిర్వచనీయమైన సహకారం అందించారని పేర్కొన్నారు.


పారిశుద్ధ్య కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారంటూ దీర్ఘకాలంపాటు బిందేశ్వర్ పాథక్ (Bindeshwar Pathak) అలుపెరుగని పోరాటం చేశారు. మానవ వ్యర్థ్యాలను కార్మికులు శుభ్రపరచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకోసం తన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఏకంగా 1.3 బిలియన్ల కుటుంబాలకు టాయిలెట్లు నిర్మించారు. ఈయన సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు పలు నిబంధనలను ప్రవేశపెట్టాయి.

విద్య ద్వారా మానవ హక్కులు, పర్యావరణ పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, సంస్కరణలను ప్రోత్సహించే సామాజిక సేవా సంస్థే సులభ్‌ ఇంటర్నేషనల్‌. ప్రస్తుతం ఈ సంస్థ 1,600 పట్టణాలు, నగరాల్లో 9,000కుపైగా సామాజిక మరుగుదొడ్ల కాంప్లెక్స్‌లను నిర్వహిస్తోంది. కొన్ని రైల్వేస్టేషన్లలోని మరుగుదొడ్లను సైతం ఈ సంస్థ నిర్వహిస్తోంది. 2020లోనే ఈ సంస్థ టర్నోవర్‌ రూ.490 కోట్లుగా నమోదైంది.

మానవ వ్యర్థాలను చేతులతో ఎత్తిపారబోయడాన్ని సులభ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ మొదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిని రద్దు చేసేందుకు ఉద్యమాన్ని నడిపింది. ఈ క్రమంలో ఏళ్ల తరబడి సమాజంలో నాటుకుపోయిన ఈ విధానాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకువచ్చింది. సపాయీ కర్మచారీల కుమారులు, కుమార్తెలకు, సమాజంలోని అణగారిన వర్గాల ప్రజల సంతానానికి కంప్యూటర్‌ విద్య, టైపింగ్‌, షార్ట్‌హ్యాండ్‌, ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌, చెక్క పని, తోలు పని, డీజిల్‌, పెట్రోల్‌ ఇంజినీరింగ్‌, టైలరింగ్‌, కేన్‌ ఫర్నీచర్‌ తయారీ, మోటార్‌ డ్రైవింగ్‌ వంటి అంశాల్లో శిక్షణ ఇప్పించేందుకు ‘సులభ్‌’ సంస్థ అనేక సంస్థలను స్థాపించింది. బృందావన్‌లో విడిచిపెట్టిన వితంతువులకు ఆర్థిక సహాయమూ అందిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story