Shiv Sena: 56 ఏళ్ల శివసేన పార్టీ చరిత్ర.. నాలుగుసార్లు తిరుగుబాట్లు..

Shiv Sena: 56 ఏళ్ల శివసేన పార్టీ చరిత్ర.. నాలుగుసార్లు తిరుగుబాట్లు..
Shiv Sena: శివసేనలో సంక్షోభం కొత్తేం కాదు. 56 ఏళ్ల పార్టీ చరిత్రలో ఇప్పటికి నాలుగు సార్లు తిరుగుబాట్లు జరిగాయి.

Shiv Sena: శివసేనలో సంక్షోభం కొత్తేం కాదు. 56 ఏళ్ల పార్టీ చరిత్రలో ఇప్పటికి నాలుగు సార్లు తిరుగుబాట్లు జరిగాయి. అన్నింటినీ తట్టుకుని నిలబడిన శివసేనలో ఇప్పుడు వచ్చిన తిరుగుబాటు, సంక్షోభం కాస్త గట్టిదేనని చెప్పాలి. ఒకరిద్దరు ఎదురు తిరగడం, మహా అయితే పది మంది ఎమ్మెల్యేలను పట్టుకుపోవడమే జరిగింది. కాని, ప్రస్తుతం 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం, శివసేన పార్టీ తమదేనని రెబల్స్‌ షాక్‌ ఇవ్వడం.. ఇదివరకెప్పుడూ జరగనిదే. పైగా షిండే తిరుగుబాటు మినహా మిగిలిన సంక్షోభాలన్నీ బాల్‌థాక్రే హయాంలో జరిగాయి. వాటిని గట్టెక్కించి, పార్టీని నడిపించారు బాల్‌థాక్రే. ఇప్పుడు ఉద్ధవ్‌ థాక్రే ఎలా మేనేజ్‌ చేస్తారో చూడాలి.

ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించడం అనేది శివసేనలో మొదలైంది చగన్‌ భుజ్‌బల్‌తోనే. 1991లో శివసేనలో జరిగిన అనూహ్య పరిణామం అప్పట్లో అందరినీ షాక్‌కి గురించేసింది. ఓబీసీ నాయకుడైన భుజ్‌బల్‌.. గ్రామీణ ప్రాంతాల్లోనూ శివసేన బలోపేతం కోసం చాలా కృషి చేశారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో శివసేన పార్టీకి పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. కాని, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా మాత్రం మనోహర్‌ జోషికి ఇచ్చారు పార్టీ అధినేత బాల్‌ థాక్రే. దీంతో మనస్తాపానికి గురైన భుజ్‌బల్‌.. 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ వీడారు.

థాక్రే మంత్రాంగంతో 12 మంది ఎమ్మెల్యేలు తిరిగి శివసేన గూటికి రావడంతో సంక్షోభం సమసిపోయింది. 1999లో నారాయణ రాణె రూపంలో మరోసారి తిరుగుబాటు వచ్చింది. పార్టీలోని మరో కీలక నేత బాల్‌థాక్రేకు ఎదురుచెప్పారు. పైగా నారాయణ రాణెను ఏరి కోరి ముఖ్యమంత్రిని చేసింది శివసేన అధినేత బాల్‌ థాక్రేనే. అలాంటిది.. ఏకంగా బాల్‌థాక్రేపైనే నారాయణ ఎదురు తిరిగారు. మహారాష్ట్రలోని కొంకణ్‌ ప్రాంతంలో నారాయన రాణెకు పట్టు ఉండడం, చేతిలో సీఎం పదవి ఉండడంతో మొత్తం పార్టీనే తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నించారు.

పైగా నారాయణ రాణెపై పార్టీ వ్యతిరేక పనులు చేస్తూ, టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో నారాయణ రాణెను 2005లో పార్టీ నుంచి బహిష్కరించారు బాల్‌థాక్రే. 2006లో సొంత కుటుంబం నుంచే బాల్‌థాక్రేకు వ్యతిరేకత ఎదురైంది. శివసేన పగ్గాలు ఎవరికి ఇస్తారనే విషయంపై అప్పట్లో అంతర్గత పోరు తీవ్రంగా నడిచింది. బాల్‌థాక్రే తమ్ముడి కొడుకు రాజ్‌ థాక్రే.. శివసేన పార్టీ పగ్గాలు ఆశించారు. కాని, బాల్‌థాక్రే మాత్రం.. వారసుడిగా ఉద్ధవ్‌ థాక్రేనే ఎంచుకున్నారు. మెల్లమెల్లగా రాజ్‌థాక్రేకి పార్టీలో ప్రాధాన్యత తగ్గించారు.

దీంతో రాజ్‌థాక్రే 2005లో పార్టీకి రాజీనామా చేసి, 2006లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. ఇప్పుడు ఏక్‌నాథ్‌ షిండే రూపంలో మరోసారి సంక్షోభం తలెత్తింది. ఉద్ధవ్‌ థాక్రే సీఎం అయ్యాక కుమారుడు ఆదిత్య థాక్రేకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం షిండేకు నచ్చలేదు. చివరికి తన శాఖ వ్యవహారాల్లో కూడా ఆదిత్య థాక్రే జోక్యం చేసుకోవడం షిండేలో ఆగ్రహం మరింత పెంచింది. పైగా శివసేనలో కింద స్థాయి నుంచి ఎదిగిన షిండేకి పార్టీపై మంచి పట్టు ఉండడంతో.. తిరుగుబాటు చేశారు. షిండే కొట్టిన దెబ్బకి ప్రస్తుతం శివసేన ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. మరి ఈ సంక్షోభాన్ని ఉద్ధవ్‌ థాక్రే ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story