Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి
సరిహద్దు ఏజెన్సీ అటవీ ప్రాంతంలో మళ్లీ తుపాకుల మోత

తెలంగాణ,ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీప్రాంతం మరోసారికాల్పులతో దద్ధరిల్లింది. పోలీసులు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్‌ హతమయ్యారు . దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కమాండర్‌తోపాటు మరో ఇద్దరు మృతిచెందారు. ఘటనాస్ధలి నుంచి ఏకే 47తోపాటు ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ,ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని దండకారణ్యం వరుసకాల్పులతో దద్ధరిల్లుతోంది. 4రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతాబలగాలు- మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో 10మంది మావోయిస్టులు మృతిచెందగా శనివారం జరిగినఎదురుకాల్పుల్లో మరో ముగ్గురు హతమయ్యారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రిగుట్ట- ఛత్తీస్‌గఢ్‌లోని ఊసూరు బ్లాక్ ఠానా పరిధిలోని పూజారీ కాంకేర్ అటవీ ప్రాంతంలోకూంబింగ్‌దళాలు- మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దండకారణ్య స్పెషల్‌జోన్‌కమిటీ సెంట్రల్ రీజియన్ కమాండర్ అన్నె సంతోష్ అలియాస్ సాగర్‌తోపాటు ACM మణిరాం మరో దళసభ్యుడు మృతిచెందారు. ఘటనాస్ధలిలో ఏకే 47తోపాటు 12 బోర్ తుపాకులు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో దాడులే లక్ష్యంగా మావోయిస్టులు ప్రత్యేకంగా సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో భద్రతాబలగాలు కూంబింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాలను హెలికాఫ్టర్ లో బీజాపూర్‌కు తరలించారు.

మావోయిస్టు పార్టీలో క్రమక్రమంగా ఎదిగిన సంతోష్ భద్రతా బలగాలను ఎదుర్కొనేందుకు ధీటైన వ్యూహరచనలు చేయడం, పకడ్బందీ దాడులు చేయడంలో నేర్పరి. అతనిపై ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు 5 లక్షల రివార్డు ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుశాపూర్‌కి చెందిన సంతోష్ 22 ఏళ్ల క్రితమే అడువుల బాటపట్టాడు. ఛత్తీస్‌గఢ్ అభయారణ్యం జోనల్ కమిటీ కమాండర్‌గా పని చేస్తున్నాడు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ఘడ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్‌ను ఖండిస్తూ BKASR కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరిటలేఖ విడుదలైంది. ములుగు SP కనుసన్నల్లో ఎన్‌కౌంటర్ జరిగిందని అందుకు SP పూర్తిబాధ్యత వహించాలని నెత్తుటి బాకీ తీర్చుకుంటామని లేఖలో పేర్కొన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story