Uttar Pradesh: రేప్‌ కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష

Uttar Pradesh: రేప్‌ కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష
యూపీలోని ఎంపీ- ఎమ్మెల్యే కోర్టు సంచలన తీర్పు

మైనర్‌ బాలికపై అత్యాచారం చేసినట్టు నేరం రుజువు కావడంతో యూపీలోని బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దులార్‌ గోండ్‌కు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా విధిస్తూ ఎంపీ-ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హునిగా ప్రకటించడానికి రంగం సిద్ధమవుతోంది. ఆయన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని దుద్ధి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం 2014 నవంబరు 4న మైనర్‌ బాలికపై అత్యాచారం చేసినట్టు గోండ్‌పై కేసు నమోదయింది. అప్పటికి ఆయన ఎలాంటి పదవిలో లేరు. తర్వాతి కాలంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మైనర్‌ బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దులార్‌ గోంద్‌ను దోషిగా తేల్చుతూ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తీర్పు వెలువరించింది. సోన్‌భాద్రాలోని ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి ఉల్లాఖాన్‌ ఈ మేరకు తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యే గోండుపై ఐపీసీ సెక్షన్లు 376, 506, పోక్సో చట్టంలోని నిబంధనల ప్రకారం యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే రామ్‌దులార్‌ గోంద్‌కు 25 ఏండ్ల కఠిన జైలు శిక్ష విధించటమేగాక, రూ.10 లక్షల జరిమానా చెల్లించాలంటూ తీర్పు చెప్పారు. ఈ మొత్తాన్ని బాధితురాలికి అందజేయాలని తీర్పులో పేర్కొన్నారు.

కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రజాప్రాతినిథ్య చట్టం కింద, ఎమ్మెల్యే రామ్‌దులార్‌ గోంద్‌పై అనర్హత వేటు పడనున్నది. దీంతో ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. అంతేగాక అతడిపై మరో 6 సంవత్సరాలపాటు నిషేధం అమలవుతుంది. ఈ కేసులో తన క్లయింట్‌కు కఠిన శిక్ష విధించవద్దని ఎమ్మెల్యే తరఫు న్యాయవాది జడ్జిని వేడుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పూర్తిస్థాయిలో ఆదుకుంటాడని విన్నవించుకున్నాడు. కాగా ఆయన వాదనను జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. మ్యోర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2014 నవంబర్‌ 4న లైంగికదాడి ఘటన చోటుచేసుకుంది. కోర్టు తీర్పుపై బాధితురాలి కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేసిన దుద్ధి అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేను డిసెంబర్ 12వతేదీన కోర్టు దోషిగా నిర్ధారించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యప్రకాష్ త్రిపాఠి తెలిపారు.

నేరం జరిగినప్పుడు రామ్దులర్ గోండ్ ఎమ్మెల్యే కాదని, అతని భార్య గ్రామ ప్రధాన్ అని త్రిపాఠి తెలిపారు. ఈ కేసులో విచారణ పోక్సో కోర్టులో ప్రారంభమైంది. అయితే నిందితుడైన గోండ్ శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు ఈ కేసును ఎంపీ, ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష పడిన ఉదంతం యూపీలో సంచలనం రేపింది.

Tags

Read MoreRead Less
Next Story