Gyanvapi Mosque: జ్ఞానవాపి కేసులో కీలక మలుపు..

Gyanvapi Mosque: జ్ఞానవాపి కేసులో కీలక మలుపు..
హిందువులు పూజలు చేసుకోవచ్చని కోర్టు తీర్పు..

ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసుకీలక మలుపు తిరిగింది. ఈ ప్రార్థనా మందిరంలో సీల్‌ చేసి ఉన్న బేస్‌మెంట్‌లో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు అనుమతినిచ్చింది. ఇందుకు అనుగుణంగా..వారం రోజుల్లోగా ఏర్పాట్లు చేయాలని, పూజలు చేసుకునేందుకు బారికేడ్లు తొలగించాలంటూ అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన అర్చకులతో.... పూజలు చేయించాలని కోర్టు సూచించింది.

ఉత్తర్ ప్రదేశ్ వారణాసి జిల్లాలో జ్ఞానవాపి మసీదు కేసులో జిల్లా కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 1993 వరకూ మసీదు సెల్లార్‌లో దేవతామూర్తులకు పూజలు చేసిన పూజారి కుటుంబం తిరిగి పూజలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి AK విశ్వేష్.... వారం రోజుల్లోగా ఆ కుటుంబం పూజలు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు.అక్కడ పూజలు కాశీ విశ్వనాథ్‌ ఆలయ ట్రస్ట్‌ నేతృత్వంలో జరగాలని నిర్దేశించింది. గతంలో విచారణ సందర్భంగా..1993 వరకూ పూజారి సోమ్‌నాథ్‌ వ్యాస్‌ జ్ఞాన్‌వాపి మసీదులోని సెల్లార్‌లో దేవతామూర్తుల విగ్రహాల వద్ద పూజలు చేశారని ఆయన కుమార్తె కొడుకు శైలేంద్ర కుమార్‌ పాఠక్‌ కోర్టులో వాదనలు వినిపించారు.తర్వాత ములాయం సింగ్‌ యాదవ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ దేవతా మూర్తులకు పూజలు నిర్వహించకుండా అడ్డుకున్నారని ఈ కేసులో హిందువుల తరపు న్యాయవాది తెలిపారు. అక్కడ పూజలు జరిపే హక్కు తమకు ఉందని శైలేంద్ర కుమార్‌ పేర్కొన్నారు. అయితే సెల్లార్‌ మసీదు కాంప్లెక్స్‌లో భాగమని ముస్లింల తరఫు న్యాయవాది వాదించారు. అందులో పూజలకు అనుమతి ఇవ్వరాదని కోరారు. ఇరుపక్షాల వాదనలు ఉన్న జిల్లా కోర్టు పూర్తిస్థాయిలో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని గత ఏడాది జులై 21న పురావస్తు శాఖను ఆదేశించింది.


వాస్తవానికి జ్ఞానవాపి మసీదు కాశీవిశ్వనాథ్‌ ఆలయానికి పక్కనే ఉండగా ఆలయ భూమిలోనే మసీదు నిర్మించారా అనే అంశంపైనా అధ్యయనం చేయాలని సూచించింది. తర్వాత ఈ అంశం సుప్రీంకోర్టు ముందుకు వెళ్లగా కోర్టు ఆదేశాల మేరకు సీల్‌ చేసిన వాజూఖానా మినహా మసీదు ప్రాంగణమంతా కార్బన్‌ డేటింగ్‌ ఇతర పద్ధతులతో భారత పురావస్తు విభాగం సర్వే చేసింది. ఈ సర్వేలో కీలక విషయాలు బయటపడినట్లు... హిందువుల తరఫు న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ ఇటీవల తెలిపారు. మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలున్నట్లు సర్వే నివేదిక పేర్కొందని వెల్లడించారు. ఆ ప్రాంగణంలో తెలుగు, కన్నడ, దేవనాగరి సహా 34 భాషల్లో శాసనాల ఆనవాళ్లు లభించినట్లు తెలిపారు. ఈ ఆలయానికి సంబంధించిన స్తంభాలకే కాస్త మార్పులు చేసి మసీదు నిర్మాణంలో వినియోగించినట్లు సర్వే తేల్చిందన్నారు. కాశీ ఆలయ పరిధిలోనే మసీదు నిర్మించినట్లు శాస్త్రీయ సర్వే ద్వారా వెల్లడైందని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జిల్లా కోర్టు, పూజారి కుటుంబం మసీదు సెల్లార్‌లో పూజలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చింది. పూజలు నిర్వహించేందుకు అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించాలని హిందువుల తరఫు న్యాయవాది కోరగా వారం రోజుల్లో పూజలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story