CWC 2023: కొనసాగుతున్న అఫ్గాన్‌ సంచలనాలు

CWC 2023: కొనసాగుతున్న అఫ్గాన్‌ సంచలనాలు
శ్రీలంకపై ఘన విజయం... ప్రపంచకప్‌లో మూడో విజయం

ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ సంచలనాలు కొనసాగుతున్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ను మట్టికరిపించిన అఫ్గానిస్తాన్ ఇప్పుడు శ్రీలంకను కూడా చిత్తు చేసి సెమీఫైనల్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తమ వరుస విజయాలు గాలివాటం కాదని నిరూపిస్తూ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. అఫ్గాన్ చేతిలో ఓటమితో ప్రపంచకప్‌లో లంకేయుల సెమీస్‌ అవకాశాలకు తెరపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్ఘానిస్థాన్‌ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌... 45.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని చేధించింది.


టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బ్యాటర్లకు అఫ్గాన్‌ ఆదిలోనే షాక్‌ ఇచ్చింది. స్కోరు బోర్డుపై 22 పరుగులు చేరగానే కరుణరత్నే పెవిలియన్‌ చేరాడు. 21 బంతుల్లో 15 పరుగులు చేసిన కరుణరత్నేను ఫరూకీ అవుట్‌ చేసి అఫ్గాన్‌కు తొలి బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత నిసంక, కుశాల్‌ మెండీస్‌ జోడి లంక స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. రెండో వికెట్‌కు 62 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పడంతో లంక కోలుకుంది. 60 బంతుల్లో 5 ఫోర్లతో 46 పరుగులతో అర్ధ సెంచరీ దిశగా సాగుతున్న నిసంకను ఒమ్రజాయ్‌ అవుట్‌ చేశాడు. దీంతో 84 పరుగుల వద్ద లంక రెండో వికెట్‌ కోల్పోయింది. 134 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి లంక పటిష్టంగానే కనిపించింది. కానీ కాసేపటికే ఈ ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సధీర సమరవిక్రమను అవుట్‌ చేసి ముజీబుర్‌ రెహ్మన్‌ లంకకు షాక్ ఇచ్చాడు. అసలంక 28 బంతుల్లో 22 పరుగులు, మాథ్యూస్‌ 26 బంతుల్లో ఒక సిక్సు, ఒక ఫోర్‌తో 23 పరుగులు, తీక్షణ 31 బంతుల్లో 3 ఫోర్సు, ఒక సిక్సుతో 29 పరుగులతో రాణించడంతో లంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్‌ అయింది.


లంక బ్యాటర్లలో ఒక్కరు కూడా అర్ధశతకం సాధించలేదు. అఫ్గాన్‌ బౌలర్లలో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన ఫరూకీ కేవలం 34 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు నేలకూల్చాడు. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్‌ సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కానీ ఆదిలోనే అఫ్గాన్‌కు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు చేరకముందే ఫామ్‌లో ఉన్న గుర్బాజ్‌ను మధుశంక బౌల్డ్ చేశాడు. కానీ ఈ ఆనందం లంకకు ఎక్కువసేపు నిలువలేదు. తర్వాత వచ్చిన బ్యాటర్లందరూ లంక బౌలర్లను సునాయసంగా ఎదుర్కొంటూ లక్ష్యం దిశగా కదిలారు. ఇబ్రాం జర్దాన్‌ 39, రహ్మత్‌ షా 62, హస్మతుల్లా షాహిదీ 58, అజ్మాతుల్ల ఒమ్రాజాయ్‌ 73 పరుగులతో రాణించడంతో అఫ్గాన్‌ కేవలం 45.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి మరో 28 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్ని అందుకుంది. లంక బౌలర్లలో మధుశంక 2, రజత ఒక వికెట్‌ తీశారు.

Tags

Read MoreRead Less
Next Story