CWC2023: ఆస్ట్రేలియా విజయపరంపర

CWC2023: ఆస్ట్రేలియా విజయపరంపర
చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌పై విజయం.... పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి కంగారులు

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా అయిదో విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌట్‌ అయింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 48.1ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ఆస్ట్రేలియా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ పరాజయంతో ఇంగ్లండ్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగునే కొనసాగుతుండగా... ఆస్ట్రేలియా మూడో స్థానానికి ఎగబాకింది. ఈ పరాజయంతో ఇంగ్లండ్‌ ఛాంపియన్స్‌ కప్‌ ఆశలు కూడా గల్లంతయ్యాయి. పాయింట్ల పట్టికలో తొలి ఏడు స్థానాల్లో ఉన్న జట్లకు మాత్రమే 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత ఉంటుంది.


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఇంగ్లండ్‌ బౌలర్లు షాక్‌ ఇచ్చారు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన ట్రావిస్‌ హెడ్‌ను వోక్స్‌ 11 పరుగులకే వెనక్కి పంపాడు. మంచి ఫామ్‌లో ఉన్న వార్నర్‌ను కూడా 15 పరుగులకే వోక్స్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో 38 పరుగులకే ఆసిస్‌ రెండో వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌ ఆసిస్‌ను ఆదుకున్నారు. 52 బంతుల్లో 3 ఫోర్లో 44 పరుగులు చేసిన స్టీవ్‌ స్మిత్‌ను అదిల్‌ రషీద్‌ పెవిలియన్‌కు పంపాడు. జోస్‌ ఇంగ్లిస్‌ను అవుట్‌ చేసి రషీద్‌ మళ్లీ దెబ్బకొట్టాడు. 117 పరుగుల వద్ద కంగారులు నాలుగో వికెట్‌ కోల్పోయారు. 71 పరుగులు చేసిన లబుషేన్‌ను వుడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 178 పరుగుల వద్ద కంగారులు అయిదో వికెట్‌ కోల్పోయారు. 52 బంతుల్లో 5 ఫోర్లతో 47 పరుగులు చేసిన గ్రీన్‌ను విల్లీ బౌల్డ్‌ చేశాడు. అవుటయ్యాడు. స్టోయినీస్‌ 35 పరుగులు చేశాడు. పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆడమ్‌ జంపా కూడా రాణించడంతో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్‌ వోక్స్ 4 వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. మార్క్‌ వుడ్‌ 2, అదిల్‌ రషీద్‌ 2 వికెట్లు తీశారు.

287 పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్‌ బరిలోకి దిగగా ఇన్నింగ్స్ తొలి బంతికే స్టార్క్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టో అవుటయ్యాడు. 19 పరుగుల వద్ద జో రూట్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. దీంతో 19 పరుగులకే ఇంగ్లండ్‌ రెండు వికెట్లు కోల్పోయింది. 64 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సుతో 50 పరుగులు చేసి మలన్‌ అవుటయ్యాడు. 90 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసిన బెన్‌స్టోక్స్‌ను జంపా అవుట్‌ చేయడంతో 169 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక ఆస్ట్రేలియా విజయం ఖాయమనే అనుకున్నా ఇంగ్లండ్‌ టెయిలెండర్లు పోరాడారు. మొయిన్‌ అలీ 42, క్రిస్‌ వోక్స్ 32లతో కాసేపు పోరాడారు. చివరికి 48.1 ఓవర్లలో 253 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌ అయింది. దీంతో 33 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జంపా 3, కమిన్స్‌ 2, స్టార్క్‌ 2, హేజిల్‌వుడ్‌ 2 వికెట్లు తీశారు.

Tags

Read MoreRead Less
Next Story